క్రీడాశాఖపై భారత ఒలింపిక్‌ సంఘం విమర్శలు

తమ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని సూచన

న్యూఢిల్లీ ,నవంబర్‌ 22 :కేంద్ర క్రీడాశాఖ , భారత ఒలింపిక్‌ సంఘం మధ్య మరోసారి వివాదం ముదురుతోంది. తమ వ్యవహారాలు , ఎన్నికలకు సంబంధించిన విషయాలలో జోక్యం చేసుకోవడంపై క్రీడాశాఖను ఐవోఎ తప్పుపట్టింది. తమ ఎన్నికలు తమ ఇష్టం వచ్చినట్టు జరుపుకుంటామని ఐవోఎ ప్రస్తుత ప్రెసిడెంట్‌ వికె మల్హోత్రా తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించాడు. ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్‌ సమాఖ్యకు కేంద్ర క్రీడాశాఖ ప్రత్యేక లేఖ రాయడంతో ఈ వివాదం మొదలైంది. క్రీడాశాఖ కార్యదర్శి దేబ్‌ రాసిన లేఖలో కొన్ని తప్పులు , మిగిలిన అవాస్తవాలు ఉన్నాయని మల్హోత్రా విమర్శించారు. ఏ విధంగానూ ఐవోఎ వ్యవహారాలలో జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం లేదని స్పష్టం చేశారు. గతంలోనే స్పోర్ట్స్‌ పాలసీల పరిధిలోకి తాము రాలేమని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక తమ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం స్పందించడాన్ని కూడా మల్హోత్రా తప్పుపట్టారు. నిబంధనల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని , దీనిపై ఎవరి సలహాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 25న జరగాల్సిన ఐవోఎ ఎన్నికలు డిసెంబర్‌ 5కు నాయిదా పడ్డాయి. ఎన్నికల పరిశీలకునిగా నియమించి బడిన ఖురేషీ హఠాత్తుగా ఆ పదవి నుండి తప్పుకోవడం వాయిదా అనివార్యమైంది.