క్రీడా విజేతలకు భారీ నజరానాలు

చండీగఢ్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు నజరానాల వర్షం కురుస్తోంది. తాజాగా రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించిన హరియాణా క్రీడాకారిణి వినేశ్‌ ఫొగాట్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.3కోట్ల నజరానాను అందజేయనున్నట్లు ప్రకటించింది. హరియాణా క్రీడల శాఖ మంత్రి అనిల్‌ విజ్‌ ట్విటర్‌ ద్వారా వినేశ్‌ను అభినందిస్తూ నజరానా ప్రకటించారు. అంతేకాదు సివిల్‌ సర్వీసెస్‌ లేదా పోలీస్‌ సర్వీస్‌లో ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే షూటింగ్‌లో రజత పతకం సాధించిన లక్షయ్‌ షెరాన్‌కు రూ.1.5కోట్లు అందజేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే హరియాణా ప్రభుత్వం రెజ్లర్‌ భజ్‌రంగ్‌ పునియాకు రూ.3కోట్ల నజరానాను ప్రకటించిన సంగతి తెలిసిందే. 50 కిలోల విభాగంలో వినేశ్‌ ఫొగాట్‌ సోమవారం బంగారు పతకాన్ని ముద్దాడింది. దీంతో ఆసియా క్రీడల్లో పసిడి గెలిచిన తొలి మహిళా రెజ్లర్‌గా వినేశ్‌ చరిత్ర సృష్టించింది.