క్లాష్ ఆఫ్ ది టైటాన్స్!

వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఆక్లాండ్ వేదికగా ఆతిథ్య న్యూజీలాండ్ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అన్ బీటబుల్ బ్లాక్ క్యాప్స్ ఫైనల్ బెర్తు కోసం సౌతాఫ్రికాతో పోరుకు సై అంటోంది. ఆరు సార్లు సెమీఫైనల్లో భంగ పడ్డ న్యూజీలాండ్ ఈ సారి టైటిల్ సాధించడమే లక్ష్యంగా దూసుకెళుతోంది. గ్రూప్ దశ నుంచి అప్రతిహత విజయాలతో దూసుకెళుతోన్న కివీస్ సెమీఫైనల్లోనూ చెలరేగాలని పట్టుదలగా ఉంది.

అద్భుతమైన బ్యాటింగ్. తిరుగులేని బౌలింగ్. అంతకు మించి సొంత మైదానం… న్యూజీలాండ్ కు ఇంతకంటే మంచి ఛాన్స్ మరొకటి దొరకదు. అందుకే తొలిసారిగా వరల్డ్ కప్ ఫైనల్ చేరాలని కివీస్ ఉరకలేస్తోంది. బ్రెండన్ మెకల్లమ్ డైనమిక్ కెప్టెన్సీ కివీస్ కు ప్రధాన బలం. అగ్రెసివ్ అప్రోచ్ తో మెకల్లమ్ జట్టులో స్పూర్తి నింపుతున్నాడు. క్వార్టర్ ఫైనల్లో డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించిన మార్టిన్ గుఫ్తిల్ బ్యాటింగ్ లో మెయిన్ స్ట్రెంత్. గుఫ్తిల్, మెకల్లమ్కు తోడు యంగ్ స్టార్ కేన్ విలియమ్సన్ తో న్యూజీలాండ్ టాపార్డర్ అద్భుతంగా ఉంది. ఇక రాస్ టేలర్, ఎలియాట్, ల్యూక్ రోంచితో కివీస్ మిడిలార్డర్ బలంగా ఉంది. ఆల్ రౌండర్ కొరీ అండర్సన్ న్యూజీలాండ్ కు అదనపు బలం.

బౌలింగ్ విభాగంలో కివీస్ పవర్ ఫుల్ గా ఉంది. వికెట్ల వేటలో దూసుకెళుతోన్న యంగ్ సెన్సేషన్ ట్రెంట్ బౌల్ట్ కివీస్ మెయిన్ వెపన్. టోర్నీలో ఇప్పటివరకు 19 వికెట్లు పడగొట్టిన బౌల్ట్ సెమీస్లో చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. బౌల్ట్- టిమ్ సౌథీ కాంబినేషన్ న్యూజీలాండ్కు టోర్నీలో బాగా కలిసొచ్చింది. ఇక గాయంతో టోర్నీకి దూరమైన అడమ్ మిల్నే స్థానంలో కైల్ మిల్స్ ను ఆడించాలని కివీస్ యోచిస్తోంది. ఆల్ రౌండర్ కొరీ అండర్సన్ కూడా కివీస్ పేస్ విభాగానికి ఎంతో యూజ్ ఫుల్ బౌలర్. వెటరన్ స్పిన్నర్ డానియల్ వెటోరీ న్యూజీలాండ్ బౌలింగ్ దళంలో కీలక అస్త్రం.

g64x8auwమరోవైపు డివిలియర్స్ సారథ్యంలో తొలి సారిగా నాకౌట్ గండాన్ని దాటిన సౌతాఫ్రికా అదే ఊపు కొనసాగించాలని కసిగా ఉంది. క్వార్టర్ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన సౌతాఫ్రికా ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతోంది. తొలిసారిగా వరల్డ్ కప్ ఫైనల్ బెర్తు దక్కించుకోవాలని సఫారీ గ్యాంగ్ ఆరాటపడుతోంది.

క్లాస్ ఓపెనర్ హషీమ్ ఆమ్లా, యంగ్ బ్యాట్స్ మెన్ డికాక్, ఆల్ రౌండర్ డూప్లెసిస్ తో సౌతాఫ్రికా టాపార్డర్ పర్ ఫుల్గా కనిపిస్తోంది. క్వార్టర్ ఫైనల్లో డికాక్ ఫాంలోకి రావడం సౌతాఫ్రికాకు ప్లస్ పాయింట్. ఇక కెప్టెన్ డివిలయర్స్ సౌతాఫ్రికా బ్యాటింగ్ కు కొండంత అండ. మ్యాచ్ ను క్షణాల్లో మలుపు తిప్పే డివిలియర్స్ ఈ కీలక సమరంలో చెలరేగాలని సఫారీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక రిల్లో రాసో, డేవిడ్ మిల్లర్, జేపీ డుమినీతో సఫారీ బ్యాటింగ్ లైనప్ సాలిడ్ గా కనిపిస్తోంది.

బౌలింగ్ లో సౌతాఫ్రికా పేస్ విభాగం సూపర్ పవర్గా కనిపిస్తోంది. స్పీడ్ గన్ డెల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్ తో పేస్ అటాక్ బలంగా ఉంది. అయితే గ్రూప్ దశలో అంతగా ప్రభావం చూపని స్టెయిన్ సెమీస్లో చెలరేగాలని ప్టటుదలగా ఉన్నాడు. ఇక వెర్నర్ ఫిలాండర్ గాయం నుంచి కోలుకోవడం సౌతాఫ్రికాకు గుడ్ న్యూస్. కైల్ అబాట్ స్థానంలో ఫిలాండర్ను ఆడించే అంశాన్ని సౌతాఫ్రికా పరిశీలిస్తోంది. ఇక క్వార్టర్ ఫైనల్లో మ్యాజిక్ చేసిన లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ సఫారీ సేనకు అదనపు బలం. తాహీర్కు తోడు డుమినీ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు.

ఆక్లాండ్ ఈడెన్ పార్క్ పిచ్ గ్రూప్ స్టేజ్ లో పేస్ బౌలింగ్కు అనుకూలించింది. గ్రూప్ దశలో ఇక్కడ ఆసీస్ తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో కివీస్ ఒక వికెట్ తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో ట్రెంట్ బౌల్ట్ 5 వికెట్లు పడగొట్టాడు. అయితే సౌతాఫ్రికా మాత్రం ఇక్కడ పాకిస్తాన్ తో ఆడిన గ్రూప్ మ్యాచ్ లో ఓటమి పాలైంది. అయితే సెమీఫైనల్ జరిగేది డ్రాప్ ఇన్ పిచ్ పై కాబట్టి ఈ సారి బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశముందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

వరల్డ్ కప్ లో ఇప్పటివరకు కివీస్, సౌతాఫ్రికా ఆరు సార్లు తలపడ్డాయి. నాలుగు సార్లు న్యూజీలాండ్ విజయం సాధించగా… సౌతాఫ్రికా రెండింట గెలిచింది. ఇక న్యూజీలాండ్ ఆరు సార్లు.. సౌతాఫ్రికా మూడు సార్లు… ప్రపంచకప్ సెమీఫైనల్స్ లో ఇంటిముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఈ సారి ఎవరు గెలిచినా ఓ కొత్త ఫైనలిస్ట్ ప్రపంచకప్ కు పరిచయం కానుంది.