క్వారీలో ఇష్టారాజ్యంగా మైనింగ్
– ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవటంలేదు
– అధికారుల నిర్లక్ష్యంతో ఘటన జరిగింది
– గ్రామ దర్శిని ఒట్టి బోగస్ కార్యక్రమం
– ప్రభుత్వ విధానాలకు నిరసనగా 15న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం
– సీపీఎం రాష్ట్ర అధ్యక్షుడు మధు
విజయవాడ, ఆగస్టు4(జనం సాక్షి) : క్వారీల్లో ఇష్టారాజ్యంగా మైనింగ్ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, కేవలం ప్రమాదాలు జరిగినప్పుడే అప్రమత్తత గుర్తుకొస్తుందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు స్పందించారు. శనివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆలూరు మండలం హత్తిబెళగల్ కొండ క్వారీలో ఇష్టారాజ్యంగా మైనింగ్ జరుగుతుందని, ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పెడచెవిన పెట్టడంతోనే ఈ ఘటన జరిగిందని అన్నారు. వీటిని టీడీపీ ప్రభుత్వ హత్యలుగా భావించాలని పేర్కొన్నారు. కార్మికులకు భద్రతా చర్యలు లేవని, లేబర్ డిపార్ట్‌మెంట్‌పై కేసులు పెట్టకుండా ఉండాలన్నదే టీడీపీ ఉద్దేశ్యంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వలస కూలీలకు సంబంధించి లేబర్ రూల్ ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు వస్తే కార్మిక శాఖ రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. కార్మికులు ఏ కంపెనీలో పని చేస్తారో ఆ కంపెనీ రిజిస్టర్లో కూడా నమోదు చేయాలని, కానీ అలా చేయడం లేదని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ప్రజలకు రక్షణ లేకుండా చేస్తోందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చట్టాలపై పునరాలోచన చేయాలని సూచించారు. గ్రామదర్శిని టీడీపీ ప్రచార కార్యక్రమంలా మారిందని, అది ఒట్టి బోగస్ కార్యక్రమమని విమర్శించారు. క్వారీ ఘటనపై అన్ని రాజకీయపక్షాలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీజేపీ, టీడీపీలు రోజురోజుకూ బలహీనపడుతున్నాయని వ్యాఖ్యానించారు. టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, విద్యార్థులపై దాడులు, నాయకుల అక్రమ అరెస్ట్‌లు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని మధు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా రాపూర్‌లో వామపక్షాలు పర్యటిస్తాయని, దళితులు, విద్యార్థులు, కార్మికుల రక్షణ కోరుతూ సెప్టెంబర్ 15న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నామని వెల్లడించారు.
క్వారీ బాధితులకు వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ…
హత్తిబెళగల్ క్వారీ ప్రమాద ఘటనలో గాయపడిన వారిని వైఎస్సార్‌సీపీ నాయకులు పరామర్శించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, ప్రాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, రాష్ట్ర కార్యదర్శులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, గౌర వెంకట్ రెడ్డిలు బాధితులను కలుసుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆలూరు నియోజకవర్గంలో అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్వారీ నిర్వాహకుడు టీడీపీ సానుభూతిపరుడు కావడం వల్లే అధికారులు అనుమతులిచ్చారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు. మరణించిన వారికి ప్రభుత్వం వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు.