క్వెట్టాలో తెగబడ్డ ఉగ్రవాదులు..63మంది మృతి
పాకిస్థాన్ లోని క్వెట్టా నగరం దాడులతో దద్దరిల్లింది. నగరంలోని సివిల్ హాస్పిటల్ లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడితో పాటు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 63 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మంది గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్యను బెలూచిస్థాన్ ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. గాయపడిన వారిలో 20 మంది పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్టు చెప్పాయి.
బెలూచిస్తాన్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బిలాల్ అన్వర్ కాశీని కాల్చి చంపిన తర్వాత ఆస్పత్రిలో ఈ మారణహోమానికి ఉగ్రవాదులు పాల్పడ్డారు. మార్నింగ్ వాక్ చేస్తున్న అన్వర్ కాశీని దుండగులు కాల్చి చంపేశారు. పోస్ట్ మార్టమ్ కోసం హాస్పిటల్ కు బిలాల్ డెడ్ బాడీ తీసుకొచ్చారు. మృతదేహం ఉంచిన ఎమర్జెన్సీ వార్డు దగ్గర లాయర్లు, జర్నలిస్టులు పెద్దసంఖ్యలో గుమిగూడి ఉన్న టైమ్ లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు.
బ్లాస్ట్ ధాటికి.. లాయర్ల డెడ్ బాడీలు చెల్లాచెదురైపోయాయి. చనిపోయినవారిలోనూ… గాయపడిన వారిలో ఎక్కువ మంది లాయర్లు, జర్నలిస్టులు ఉన్నారు. ఆస్పత్రిలో ఆత్మాహుతి దాడి తర్వాత… ఇద్దరు దుండగులు తుపాకులతో కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో.. ఎక్కువమంది గాయాలపాలయ్యారు. ఎమర్జెన్సీ, సహాయక బృందాలు, పోలీసు బలగాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించాయి. రోదనలు, అరుపులతో సివిల్ హాస్పిటల్ ప్రాంగణంలో భయానక వాతావరణం కనిపించింది. ఈ దాడికి పాల్పడింది తామేనని… పాకిస్థానీ తాలిబన్ అనుబంధ జమాత్ ఉర్ అహ్రార్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఉగ్రదాడిని ప్రెసిడెంట్ హుస్సేన్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఖండించారు.