క్షీణిస్తున్న కరుణానిది ఆరోగ్యం

– కావేరీ ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు
– ఆస్పత్రి ఎదుట భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు
– కరుణానిధికోసం ప్రార్థనలు చేయాలని అభిమానులకు సూచించిన కనిమొళి
చెన్నై, ఆగస్టు7(జ‌నంసాక్షి) : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించడంతో ఆస్పత్రి వద్దకు పెద్దసంఖ్యలో అభిమానులు, నేతలు చేరుకుంన్నారు. తమ అభిమాన నేత ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కరుణానిధి ఫొటోలను పట్టుకొని ఆయన కోసం కన్నీరు పెడుతూ ప్రార్థనలు చేస్తున్నారు. త్వరగా కోలుకొని ఆస్పత్రి నుంచి బయటకు రావాలని ఆకాంక్షిస్తున్నారు. కరుణానిధి పరిస్థితి ఇంకా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. భారీగా అభిమానులు చేరుకోవడంతో ఆస్పత్రి వద్ద భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి మంగళవారం కావేరి ఆస్పత్రికి వచ్చి కరుణానిధిని పరామర్శించారు. ఆయన కుమారుడు స్టాలిన్‌, కుమార్తె కనిమొళితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి బయట వేచి ఉన్న అభిమానులను కనిమొళి కలుసుకున్నారు. కరుణానిధి త్వరగానే కోలుకుంటారని, ఆయన కోసం ప్రార్థించాలని ఆమె కోరారు. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో కూడా కావేరి ఆస్పత్రికి వచ్చి కరుణానిధిని పరామర్శించారు. దాదాపు 600 మంది పోలీసులు ఆస్పత్రి వద్ద 24గంటల పాటు విధులు నిర్వర్తిస్తున్నారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. ‘కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని తీవ్ర కలత చెందాను. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాధికా ట్వీట్‌ చేశారు.