ఖండాల విభజనపై గత అంచనాలు తప్పు

51470295790_625x300న్యూయార్క్ : భూగోళం ఖండాలుగా విడిపోక ముందు అంతా ఒకే మహాఖండంగా ఉందనే విషయం మనకు తెల్సిందే. దాన్నే శాస్త్రవిజ్ఞాన పరిభాషలో ‘పాంగియా’ అని వ్యవహరిస్తారు. ఈ పాంగియా ఏడాదికి మిల్లీమీటరు చొప్పున చీలిపోతూ కోటాను కోట్ల సంవత్సరాలకు ఉపఖండాలుగా విడిపోయిందని శాస్త్రవేత్తలు ఇంతకాలం భావించారు. వాస్తవానికి నాలుగు కోట్ల సంవత్సరాల వరకు ఏడాదికి మిల్లీమీటరు చొప్పున విడిపోయిన ఖండాలు, ఆ తర్వాత 20 రెట్లు అధిక వేగంతో, అంటే మానవుడి వేళ్లకు గోళ్లు పెరిగినంత వేగంతో విడిపోయాయని ఇప్పుడు అంచనాకు వచ్చారు.బంకలాగా సాగే మిఠాయిని తీసుకొని లాగినప్పుడు, అది మొదట్లో బలప్రయోగం ద్వారా కష్టంగా సాగుతుందని, అది పలుచబడుతున్న కొద్దీ ఎక్కువ వేగంగా సాగి తెగిపోతుందని, భూగోళం ఖండాలుగా విడిపోవడంలో ఇదే జరిగిందని సిడ్నీ యూనివర్శిటీకి చెందిన భూభౌతిక శాస్త్రవేత్త డాక్టర్ దయత్మార్ ముల్లర్ తెలిపారు. కొన్ని ఖండాలు మరీ నాటకీయంగా విడిపోయాయని ఆయన చెప్పారు.ఉత్తర అమెరికా, ఆఫ్రికా ఖండాలుగా విడిపోవడానికి 24 కోట్ల సంవత్సరాలు పట్టి ఉంటుందని, 20 కోట్ల సంవత్సరాలకు విడిపోయే ప్రక్రియ వేగవంతమై ఉంటుందని, ఆ వేగవంత ప్రక్రియ కోటి సంవత్సరాలు కొనసాగి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా వారు ఈ అంచనాకు వచ్చారు. ఈ ప్రయోగానికి సంబంధించిన అంశాలను వారు నేచర్ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు.