ఖమ్మం జిల్లాలో రెండో రోజు సీఎం పర్యటన

6

రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఇవాళ ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్ట్, భక్తరామదాసు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. 7969 కోట్ల రూపాయలతో చేపట్టనున్న సీతారామప్రాజెక్టుతో జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు, భక్తరామదాసు ఎత్తిపోతల పథకాలతో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. వచ్చే మూడేండ్ల వ్యవధిలోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. సీతారామ ఎత్తిపోతల పథకం కింద తొలిఏడాదిలోనే 50 వేల కొత్త ఆయకట్టు, లక్ష ఎకరాల స్థిరీకరణ జరపాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. 2018-19 జూన్ నాటికి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంది. మరోవైపు భక్తరామదాసు ఎత్తిపోతల పథకం కింద కొత్తగా మరో 50 వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని నిర్ణయించింది.

సమైక్య పాలనలో తెలంగాణ ప్రయోజనాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రతిపాదించిన దుమ్ముగూడెం-రాజీవ్‌సాగర్‌, ఇందిరాసాగర్‌ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం రీడిజైనింగ్‌ చేసింది. దీని ఫలితంగా రూపుదిద్దుకున్న సీతారామ ఎత్తిపోతల పథకానికి 7వేల 969 కోట్ల రూపాయలతో అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్‌ తో సమగ్ర అధ్యయనం చేయించింది. ఈ ప్రాజెక్టుకు 2016-17బడ్జెట్‌ లో 2 వేల 790 కోట్ల రూపాయల మేర నిధులు కేటాయించనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేసిన వెంటనే త్వరితగతిన పనులు మొదలు పెట్టేందుకు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు.

దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి ప్రధాన కాలువ ద్వారా కిన్నెరసాని మీదుగా గోదావరి జలాల్ని తరలిస్తారు. 46.3 కిలో మీటర్ల కాలువ కిన్నెరసాని నది దాటిన తర్వాత కోయగట్టు వద్ద లిప్టు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ 40 మీటర్ల నుంచి 110 మీటర్ల ఎత్తునకు నీటిని ఎత్తిపోస్తారు. ఆ తర్వాత గ్రావిటీ కాలువ ద్వారా నీటిని 108 మీటర్ల స్థాయి వరకు తరలించి కమలాపురం దగ్గర 160 మీటర్లకు ఒక లిప్టు ను ఏర్పాటు చేస్తారు. అనంతరం అంచెలంచెలుగా 57.67 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ, 2.8 కిలోమీటర్ల టన్నెల్‌ ద్వారా నీటిని రేలకాయలపల్లి వరకు తరలిస్తారు. అక్కడ నీటిని లిప్టు చేసి 200 మీటర్ల స్థాయిలో ఉన్న రోళ్లపాడులో పోస్తారు. ఇది ఖమ్మం జిల్లాకే ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ లా ఉంటుంది. ఇక్కడి నుంచి బయ్యారం ట్యాంక్‌, ఎస్సారెస్పీలో నిర్మించిన డీబీఎం-60 కాలువకు నీటిని అందిస్తారు. ఇలా రాజీవ్‌సాగర్‌ సాగర్‌ ప్రాజెక్టు ప్రక్రియ పూర్తవుతుంది. దీని కింద 3.03 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మరోవైపు ఇందిరాసాగర్‌ కింద ఉన్న 1.97లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు డిజైన్‌లో స్వల్ప మార్పు చేశారు. గత డిజైన్‌ ప్రకారం ఒకేసారి 270 మీటర్ల ఎత్తునకు నీళ్లు తరలించి 1.97 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని ప్రతిపాదించారు. అయితే దీని ద్వారా 200 మీటర్ల ఎత్తులో ఉన్న భూములకు కూడా 270 మీటర్ల ఎత్తులో నీటిని ఎత్తిపోయాల్సి వస్తుంది. తద్వారా కరెంటు భారం పెరుగుతున్నది. ఇలా కాకుండా 200 మీటర్ల ఎత్తులో ఉన్న ఆయకట్టుకు కమలాపురం నుంచి ఒక లిప్టును ఏర్పాటు చేయడం ద్వారా కాంటూర్‌ కింద ఉన్న భూములకు నీరందుతుంది. అదేవిధంగా 270 మీటర్ల ఎత్తులో నీటిని ఎత్తిపోసేందుకు మరో లిప్టు ను ఏర్పాటు చేయడం ద్వారా 200-270 మీట్ల మధ్యలో ఉన్న ఆయకట్టుకు నీరు అందుతుంది. ఇలా ఈ సమీకృత ప్రాజెక్టుకు సీతారామ ఎత్తిపోతల పథకం కింద 27.47 టీఎంసీల నికర గోదావరి జలాలతో సహా మొత్తం 50 టీఎంసీల నీటిని వాడుకునేలా డిజైన్‌ రూపొందించారు. నీటి నిల్వలో భాగంగా రోళ్లపాడు రిజర్వాయర్‌ను 10.6 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించేందుకు నిర్ణయించారు. ఎండ్: సమైక్య పాలనలో రెండు ప్రాజెక్టుల డిజైన్‌ ప్రకారం 3 లక్షల 33 వేల ఎకరాల ఆయకట్టు, 1.2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేది. అయితే ప్రస్తుతం అదనంగా 1.60 లక్షల ఎకరాలతో ఐదు లక్షల ఆయకట్టు, 11.2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో సీతారామ పథకం పనులు ప్రారంభం కానున్నాయి.