ఖమ్మం జిల్లాలో సాయుధ సంచారం

ఖమ్మం : తెలంగాణలో తుపాకులు కలకలం సృష్టిస్తున్నాయి. తుపాకులతో పలువురు కలకలం సృష్టిస్తున్నారు. నిన్న రంగారెడ్డి జిల్లా షాబాద్ అడవుల్లో ఓ వ్యక్తి ఏకే 47తో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందిన విషయం విదితమే. నేడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి రాజేశ్వరపురంలో ఓ వ్యక్తి తుపాకీతో సంచరిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాజేశ్వరపురం చేరుకున్నారు. నిన్న రాత్రి ఇద్దరు వ్యక్తులు కూసుమంచిపురం వద్ద లారీలో నుంచి తుపాకులతో దిగారని స్థానికులు చెబుతున్నారు. ఇవాళ కనిపించిన వ్యక్తి అతడేనా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇద్దరు వ్యక్తులు లారీ దిగితే ఇవాళ ఒక్కడే కనిపించాడా అని స్థానికులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తుపాకీ కలిగి ఉన్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సూర్యాపేట కాల్పులు, జానకీపురం ఎన్‌కౌంటర్ ఘటనల నేపథ్యంలో మరో ఉగ్రవాది ఇక్కడే సంచరిస్తున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. సూర్యాపేట బస్టాండ్ సీసీ టీవీ ఫుటేజ్‌లో మరో వ్యక్తి బస్సు దిగి పారిపోయాడని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా జానకీపురం ఎన్‌కౌంటర్ వద్ద న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఓ వ్యక్తి ప్రయాణించినట్లు రైలు టికెట్ లభ్యమైన విషయం విదితమే. ఈ క్రమంలో మరో ఉగ్రవాది ఇక్కడే ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.