ఖమ్మం సభతో తెలంగాణ, కేసీఆర్‌ సత్తాను దేశానికి చాటాలి: మంత్రి హరీశ్‌ రావు 

 

 

 

 

 

 

 

ఖమ్మం సభతో తెలంగాణ, సీఎం కేసీఆర్‌ సత్తాను దేశానికి చాటాలని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. బీఆర్‌కు ఈ సభ చాలా ముఖ్యమని చెప్పారు. ఇది జాతీయ రాజకీయాలను మలుపు తిప్పుతుందని వెల్లడించారు. ఈ సభకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ వంటి జాతీయ స్థాయి నాయకులు వస్తున్నారని తెలిపారు. ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశానికి మంత్రి హరీశ్‌ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఇంతకుముందెన్నడు ఇలాంటి సభ జరుగలేదని చెప్పారు. పాలేరు నుంచి 50 వేల మందకి తగ్గకుండా రావాలన్నారు. ఖమ్మం సభను విజయవంతం చేసినతర్వతే తమకు నిజమైన పండుగ అని తెలిపారు.
దేశంలో తెలంగాణ నమూనాపై చర్చ జరుగుతున్నదని చెప్పారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతున్నదని ఎద్దేవా చేశారు. మన రైతుబంధును కాపీ కొట్టిన కేంద్రం.. రైతులకు రూ.2 వేలు ఇస్తుందని చెప్పారు. నల్లచట్టాలను తెచ్చి 750 మంది రైతులను బీజేపీ పొట్టన పెట్టుకున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో రైతుల ఆదాయం రెట్టింపు కాలేదుకానీ.. పెట్టుబడి మాత్రం రెండింతలయ్యిందని విమర్శించారు.