గంజాయిసాగు.. అక్రమ మద్యంపై గట్టి చర్యలేవీ?
విమర్శలకు విమర్శలు ఎక్కుపెడుతున్న నేతలు
అత్యాచార ఘటనల సందర్భంలో కఠిన చర్యలు శూన్యం
విజయవాడ,నవంబర్23 (జనం సాక్షి ): గంజాయి సాగుపై ఇటీవల ఎపిలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ గంజాయి రవాణాకు అడ్డాగా మారిందని విమర్శలు వచ్చాయి. దానికి తగ్గట్లుగా విశాఖ మన్యంలో భారీ ఎత్తున గంజాయి సాగు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. నల్లగొండ పోలీసులు వెళ్లినా..ఇతర అధికారులు వెళ్లినా అక్కడి గిరిజనులు దాడులు చేసి తరిమికొట్టారు. అంటే మన్యంలో పెద్ద ఎత్తున గంజాయి సాగు అవుతోందన్న నిజం రూఢ అయ్యింది. ఆంధప్రదేశ్ నుంచి గంజాయి దొంగ రవాణా పెద్దయెత్తున సాగుతున్నదని కేంద్ర ప్రభుత్వం 2017లోనే రాష్టాన్న్రి హెచ్చరిం చింది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి అక్రమ రవాణా, లిక్కర్ మాఫియా, బెల్టు షాపుల విూద ఉక్కుపాదం మోపడానికి ఎస్‌ఈబీ పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. గంజాయి కోసమే ఒక ప్రత్యేక బెటాలియన్‌ను కేటాయించింది.అయినా గంజాయి రవాణా అడుగడుగునా సాగిన దృశ్యాలు కనబడుతున్నాయి. ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వ పరంగా కఠిన చర్యలకు అవలంబించడం ముఖ్యం. ఇకపోతే మహిళల రక్షణకోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టనన్ని కార్యక్రమాలను ఆంధప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. ’దిశ’ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దోషులకు సత్వరమే శిక్షలు పడేలా ’దిశ’ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి కేంద్ర ఆమోదం లభించవలసి ఉన్నది. ’దిశ’ యాప్ యువతులకు ఒక రక్షా బంధనంలా మారింది. 85 లక్షలమంది ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు. అయినా మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు. అత్యాచారాలు ఇటీవలికాలంలో ఎక్కువగానే జరిగాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఉంటే భయం కలిగేది. రాజధాని కోసం తాము భూములిచ్చిన రైతులకు కనీస ఓదార్పుకలగడం లేదు. ఎన్నో ఓదార్పులకు ఆద్యుడుగా ఉన్న సిఎం జగన్ ఎందుకనో వీరిని రెండున్నరేళ్లలో ఒక్కసారీ ఓదార్చలేదు. వారిని పిలిచి మాట్లాడలేదు. ఈ ప్రభుత్వం మూడు రాజధానులను తెర విూదకు తీసుకొచ్చినందువలన తమకు అన్యాయం జరిగిందని వారంతా ఆందోళన చెందుతున్నారు. రైతులిచ్చిన భూముల్లో రాజధాని ఏర్పడినట్లయితే పరిస్తితి మరోలా ఉండేది. రాజధాని ప్రాంతంలో రైతులు సాగు చేసుకుంటున్న 2,200 ఎకరాల అసైన్డ్ భూములను తెలుగుదేశం నేతలు లాక్కున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపి అక్రమమని తేలితే జగన్ చర్య తీసుకుని ఉంటే బాగుండేది. కానీ అలా చేయకుండా మొత్తంగా ఈ వ్వయహ3రమంతా చంద్రబాబు వ్యవహారంగా చూడడమే సరిగా లేదు. అసైన్డ్ భూముల కొనుగోలు చట్ట విరుద్ధం. అయినా బాబు ప్రభుత్వం ఆమోదిం చింది. కొనుగోలు చేసిన నాయకులకు పూలింగ్ ప్యాకేజీ ప్రకటించారు. అధికారంలో ఉన్నవారు ప్రజాదరణ పొందలేకపోతే దిగిపోవడం ఖాయం. చంద్రబాబుకు అదే జరిగింది. కానీ జగన్ చేస్తున్న పనులు మళ్లీ చంద్రబాబుకు ఊపిరిపోసేవిగా ఉన్నాయి. చేజారిన అధికారాన్ని మళ్లీ అందుకోవాలని చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందులో తప్పుపట్టడానికి లేదు. రాజకీయపార్టీ నేతగా ఆయనప్రయత్నం ఆయనది. దానిని అడ్డుకోవాలంటే జగన్ మంచి పనులు చేయాలి. ప్రజలకుచేరువ కావాలి. అందులో అమరావతి ప్రజలు కూడా ఉన్నారని గుర్తించాలి. జగన్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ చేయాలి. సాధారణ ఎన్నికల్లో వైసీపీకి 50 శాతం ఓట్లు లభించాయి. స్థానిక ఎన్నికల నాటికి 70 శాతం దాటాయి. బద్వేల్‌లో 76 శాతం ఓట్లు పడ్డాయి. అంటే ప్రజల్లో ఇంకా ఆదరణ ఉందని జగన్ నమ్ముతున్నారు. అలాంటప్పుడు దానిని పదిలపరచుకునేందుకు మరిన్ని మంచిపనులు చేస్తే తప్ప లాభం ఉండడదు. ఈ ఓటుబ్యాంక్ శాశ్వతంకాదని గుర్తించాలి.