గండిపేట జలాశయానికి వరద ఉధృతి
వికారబాద్ జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షం
రంగారెడ్డి,జూలై26(జనంసాక్షి): గండిపేట జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాలైన వికారాబాద్, శంకర్‌పల్లిలో ఏకధాటిగా కురిసిన వర్షానికి గండిపేట జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మూడు ఫీట్ల మేరా 6 క్రస్ట్ గేట్లు ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1787 అడుగుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. మరోసారి నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల గ్రామ ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నార్సింగి నుండి మంచిరేవులకు వెళ్లే దారిగుండా ప్రయాణించొద్దని సూచించారు. కాగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తర్వాతి రెండ్రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా వికారాబాద్ లో 12.9 సెంటివిూటర్ల వర్షం పడిరది.
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షంకురుస్తోంది. వాగులు పొంగిన పోర్లుతున్నాయి. కోట్ పల్లి ప్రాజెక్టు అలుగు పారుతుండడంతో ధారూర్, నాగసమందర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దాచారం వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి నీరు పారుతుండటంతో తాండూరు ` హైదరాబాద్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. వికారాబాద్‌లో వర్షంతో పారుతున్న నాగులను వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పరిశీలించారు. ఫోన్‌లో ఆర్డీవోతో మాట్లాడి రెవిన్యూ, పోలీస్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.