గజదొంగ పరుశురాం అరెస్టు
విజయవాడ, ఆగస్టు 3: పేరు మోసిన గజదొంగను నూజివీడు పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుండి పావుకిలో బంగారాన్ని స్వాధీన పరుచుకున్నారు. నూజివీడు పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో దొంగతనాలు అధికమైన నేపథ్యంలో గట్టి నిఘా పెంచారు. పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా, నూజివీడు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక వ్యక్తి తారసపడ్డాడు. అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా అతడే గజదొంగ అని తెలింది. స్టూవర్ట్ పురానికి చెందిన వల్లాగి పరుశురాం, కృష్ణ, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆ గజదొంగ పరుశురాం తమకు దొరికిపోయినట్లు నూజివీడు పోలీసులు చెప్పారు. అతని వద్దనుండి చోరీ సొత్తు రికవరీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 34 చోరీ కేసుల్లో పరుశురాం నిందితుడని అతని వద్ద పెద్ద ఎత్తున చోరీ సొత్తు వుందని, ప్రస్తుతానికి పావుకేజి బంగారం మాత్రమే రికవరీ అయిందని పోలీసులు తెలిపారు.