గజపతిరాజు కోటకు బీటలు ఖాయం
– వైసీపీ నేత భూమన కరుణాకర్
విజయనగరం, అక్టోబర్2(జనంసాక్షి) : విజయనగరం టీడీపీ ఎంపీ అశోక్ గజపతి రాజు కోటలు బీటలు వారడం ఖాయమని వైఎస్సార్‌సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. మంగళవారం విజయనగరంలో భూమన విలేకరులతో మాట్లాడారు. అధికార తెలుగుదేశం పార్టీ సోమవారం జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఆటంకాలు కలిగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్రకు వెల్లువెత్తిన జనసముద్రమే అధికార పార్టీ విూద ఉన్న ఆగ్రహానికి నిదర్శనమన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విషప్రచారాన్ని సభ ద్వారా ప్రజలే తిప్పి కొట్టారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడం, బహిరంగ సభకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం ద్వారా జగన్‌మోహన్ రెడ్డిని అధికార పార్టీ నేతలు చూసి ఎంత భయపడుతున్నారో స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. ఈ రకమైన చర్యలు వారి భూస్వామ్య, నిరంకుశ పోకడలకు నిదర్శమన్నారు.