గట్టు ఎత్తిపోతల పథకానికి
సీఎం కేసీఆర్ శంకుస్థాపన
– తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులను పరిశీలించిన సీఎం
– పలు మార్పులను సూచించిన కేసీఆర్
జోగుళాంబ గద్వాల, జూన్29(జనం సాక్షి) : దశాబ్దాలుగా నెర్రెలు వారిన బీడు భూములకు శుక్రవారం మోక్షం లభించింది. బీడు భూములను కృష్ణమ్మ పరవళ్లతో జీవం పోసేందుకు మొదటి అడుగు పడింది. ఏండ్ల తరబడి పాలకుల మాటల మూటల్లోనే నలిగిన గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. శుక్రవారం మధ్యాహ్నం జోగులాంబగద్వాల జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ తొలుత తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా కేసీఆర్ వెంట మంత్రులు హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ కేశవరావు, జడ్పీ చైర్మన్ బండ్ల భాస్కర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పరిశీలించిన కేసీఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అధికారులతో అక్కడే ఎత్తిపోతల పథకం నిర్మాణంపై సవిూక్షించారు. మరో ఆరు నెలల్లో ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి కావాలని, నాణ్యతతో వేగంగా పనులు పూర్తి చేయాలని సీఎం సూచించారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి పెంచికలపాడు గ్రామం వద్ద నిర్మించనున్న గట్టు ఎత్తిపోతల పథకం పైనాల్ పనులను మధ్యాహ్నం 3.30గంటల సమయంలో కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంకు ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా గద్వాలనియోజకవర్గంలోని 33వేల ఎకరాలకు సాగునీరందించనున్నారు. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ. 553.98కోట్లను ఖర్చు చేయనున్నారు. ఈ పథకాన్ని వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.