గడ్కరీ పెద్దమనసుతో క్షమాపణలు

ప్రోటోకాల్‌ పాటించని వారికి చెంపపెట్టులా నిర్ణయం

న్యూఢిల్లీ,జూలై27(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ లోక్‌సభలో క్షమాపణలు చెప్పడం ద్వారా పెద్ద మనసు చాటుకున్నారు. ఏ మాత్రం సంకోచించకుండా ప్రోటోకాల్‌ పాటించనందుకు లోక్‌సభ వేదికగా ఆయన క్షమాపణలు చెప్పడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. అంతేగాకుండా మరోమారు ప్రోటోకాల్‌ పాటించని వారికి చెంపపెట్టులా నిలిచింది. దీనికి పలువురు గడ్కరికి అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళితే … తన నియోజకవర్గంలో జరిగిన రహదారి ప్రారంభోత్సవానికి తనను పిలవకుండా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అవమానించిందని సింధియా జీరో అవర్‌ ప్రారంభం కాగానే ఈ అంశాన్ని లేవనెత్తారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తనను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించలేదని, ఫలకంపై తన పేరును ముద్రించలేదని వెల్లడించారు. ప్రొటోకాల్‌ ప్రకారం అలాంటి కార్యక్రమాలకు స్థానిక ఎంపీలను పిలవాలని అన్నారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తాను ప్రివిలేజ్‌ మోషన్‌ పెట్టాలనుకుంటున్నానని చెప్పారు. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెంటనే స్పందించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, ఇలా జరగకూడదని అన్నారు. ఎంపీల పేర్లు కచ్చితంగా ఫలకాలపై ఉండాలని, ప్రారంభోత్సవాలకు వారిని తప్పకుండా ఆహ్వానించాలని అన్నారు. ‘నేను కార్యక్రమానికి హాజరైనందున దీనికి నేనే బాధ్యుడిని. అందరి తరఫున నేను క్షమాపణలు కోరుతున్నాను. ఇలాంటివి మళ్లీ జరగవు’ అని గడ్కరీ అన్నారు. గడ్కరీ క్షమాపణలు చెప్పినప్పటికీ సింధియా.. ఎంపీల హక్కులు, అధికారాలను కాపాడాలని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పలుమార్లు ఇదే విధంగా డిమాండ్‌ చేశారు. దీంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ స్పందిస్తూ.. రక్షణ కల్పించడానికి లాఠీ ఉపయోగించాలా అని అన్నారు. దీనిపై గడ్కరీ క్షమాపణలు చెప్పారని విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లిఖార్జున్‌ ఖర్గే కూడా మాట్లాడుతూ.. ఎంపీల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం తప్పని అన్నారు. మొత్తానికి గడ్కరీ నిర్ణయం ఇప్పుడు బిజెపిలో అందరినీ ఆకట్టుకుంది.