గద్వాలలో బాబుకు తెలంగాణ సెగ

సభలో హోరెత్తిన జై తెలంగాణ నినాదాలు
తెలంగాణపై సుస్పష్టవైఖరిపై జనంపట్టు
కుప్పకూలిన సభావేదిక .. బాబుకు స్వల్ప గాయాలు
గద్వాల, అక్టోబర్‌ 26(జనంసాక్షి) :చంద్రబాబుకు మళ్లీ తెలంగాణ సెగ తగిలింది..తెలంగాణపై రెండు కళ్ల విధానాన్ని అనుసరిస్తున్న బాబుకు తెలంగాణప్రజలు మరోసారి ఝలక్‌ ఇచ్చారు..తెలంగాణపై వైఖరేందో తేల్చేదాక తెలంగాణలో ఎక్కడికి వచ్చినా అడ్డుకుంటమని తేల్చిచెప్పారు..వస్తున్నా మీకోసం అంటూ బాబు మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తున్న పాదయాత్ర శుక్రవారం గద్వాలకు చేరుకుంది..ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జై తెలంగాణ నినాదాలు హోరెత్తించారు..ఒక్కసారిగా యువకులు సభా ప్రాంగణంలోకి దూసుకువచ్చి తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రమే తమ ఏకైక ధ్యేయమని తెలంగాణవాదులు చాటిచెప్పారు..తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని పట్టుపట్టారు..లేదంటే తెలంగాణలో పాదయాత్రను నిర్వహిం చనీయమని వెల్లడించారు..దీంతో పోలీసులు ఖంగుతిన్నారు..నినాదాలు చేస్తున్న వారిపై ఒక్కసారిగా విరుచుకుడ్డారు..వారిని బలవంతంగా అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు..మహబూబ్‌నగర్‌
జిల్లాలో బాబు పాదయాత్ర ప్రారంభమైన తర్వాత ఆయనను అడ్డుకోవడం ఇదే తొలిసారి కాదు..రాజోలిలో మొదలైన నిరసనల పర్వం గద్వాల దాకా కొనసాగుతూనే ఉంది..తెలంగాణ ఏర్పాటుకై చంద్రబాబు స్పష్టమైన లేఖ ఇస్తానన్న బాబు మాటతప్పడంపై తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు..తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుకాదంటూ చెప్పడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు..ఇదే క్రమంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆయన పాదయాత్ర ప్రవేశించిన దగ్గర్నుంచీ నిరసనలు కొనసాగుతున్నాయి..ఇదే క్రమంలో శుక్రవారం సైతం బాబుకు నిరసనలు ఎదురయ్యాయి..అయితే బాబు సభను అడ్డుకొనేందుకు యత్నించిని తెలంగాణవాదుల అరెస్ట్‌పై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి…
కుప్పకూలిన సభా వేదిక..
చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా గద్వాలలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది..గద్వాలలో ఆయన ప్రసంగం అనంతరం కార్యకర్తలు ఒక్కసారిగా తోసుకురావడంతో సభావేదిక కుప్పకూలింది..ఈఘటన అనంతరం బాబు నడుచుకుంటూ వెళ్లారు..ఈ ప్రమాదంలో చంద్రబాబు నడుము భాగంలో స్వల్పగాయాలైనట్లు స్థానిక వైద్యులు తెలిపారు. పూర్తి వైద్య పరీక్షల అనంతరం పాదయాత్ర సాగించాలని పార్టీ నాయకులు సూచించారు.