గనుల్లో ప్రమాదాలపై కార్మికుల్లో ఆందోళన
ఆదిలాబాద్, జూలై 5 : సింగరేణి భూగర్భ గనుల్లో తరుచూ జరుగుతున్న ప్రమాదాలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గనుల్లో జరుగుతున్న ప్రమాదాలతో కార్మికుల ఆందోళన రోజురోజుకు పెరిగిపోతుంది. గనుల్లో జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, గనుల్లో ఇతర వసతులను కల్పించడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కార్మిక సంఘాలు, కార్మికులు ఆరోపణలు చేస్తున్నారు. భూగర్భ గనుల్లో గాలి సరఫరా లేక కార్మికులు మృత్యువాత పడుతున్నారని బుధవారం శ్రీరాంపూర్ పరిధిలోని ఆర్.కె-6 గనిలో కార్మికుడు రాజేషం మృత్యువాతపడడమే ఇందుకు నిదర్శనమన్నారు. గనుల్లో గాలి సరఫరా లేకపోవడంతోనే రాజేషం మరణించాడని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నా యాజమాన్యం ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. భూగర్భ గనుల్లో సరఫరా చేసే గాలి వేగం, అందులో ఉండే ప్రాణవాయు పరిమాణం, అక్కడ ఉండే ఉష్ణోగ్రతను పరిగణనలోకి తీసుకుంటూ కార్మికులకు అవసరమైన గాలిని సరఫరా చేయాల్సి ఉంటుంది. గనుల్లో ఉష్ణోగ్రత పెరిగినట్లు అయితే వెంటనే పనులను నిలిపివేయాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధనలు ఉన్నప్పటికీ బొగ్గు ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టకపోవడంతో కార్మికులు మృత్యువాతపడుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు సింగరేణివ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయని నివారణ చర్యలు మాత్రం అధికారులు చేపట్టడం లేదు. గాలి సరఫరాపై, పని స్థలాలలో ఉష్ణోగ్రత ఎంత ఉందనే విషయాన్ని కార్మికులు తెలుసుకునేల చర్యలు తీసుకున్నట్లయితే ఈ ప్రమాదాలను నివారించవచ్చునని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గనులపై కార్మిలకు అవగాహన కల్పించడానికి చర్యలు చేపట్టాలని వివిధ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.