గర్భిణిని కదులుతున్న ట్రైన్ నుంచి తోసేశారు
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొందరు బిహార్ యువకులు నాలుగు నెలల గర్భిణిని నడుస్తున్న ట్రైన్‌లో నుంచి కిందకు తోసేశారు. జిల్లాలోని ఏలూరు పవర్‌పేట స్టేషన్ వద్ద ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్యను కిందకు తోసేయడంతో ఆమె భర్త కూడా ట్రైన్‌లో నుంచి బయటకు దూకారు. కిందపడి తలకి గాయాలైన భార్యను ఆమె భర్త స్థానికుల సహాయంతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై బాధితురాలి భర్త మాట్లాడుతూ.. తాము సికింద్రాబాద్ నుంచి పశ్చిమబెంగాల్ వెళ్తున్నట్టు పేర్కొన్నారు. తన భార్యను వేధించిన బిహార్ యువకులు ఆమెను ట్రైన్‌లో నుంచి తోసివేసినట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.