గల్ఫ్‌ బాధితులను భారత్‌కు రప్పించాలి

విదేశాంగ శాఖ కార్యదర్శితో ఎంపిల భేటీ

న్యూఢిల్లీ,ఆగస్టు 8(జ‌నం సాక్షి): గల్ఫ్‌ బాధితుల కష్టాలపై కేంద్ర విదేశాంగ శాఖ జాయింట్‌ సెక్రటరీ నాగ ప్రసాద్‌తో ఎంపీలు వినోద్‌, బిబి పాటిల్‌, గల్ఫ్‌ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బసంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని క్షేమంగా స్వదేశానికి రప్పించాలని కోరారు.

గల్ఫ్‌ బాధితుల సమస్యలపై కేంద్ర విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్‌నూ ఎంపీలు కలిశారు. ఉపాధి కోసం గల్ఫ్‌ బాట పట్టిన తెలంగాణకు చెందిన పలువురి మిస్సింగ్‌పై కేంద్ర విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శికి ఎంపీలు వివరించారు. ఉపాధి కోసం గల్ఫ్‌ బాటపట్టిన నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సతీష్‌, మల్లయ్య, మెదక్‌ జిల్లాకు చెందిన పోచమల్ల సతీష్‌లు తిరిగి స్వదేశానికి చేరుకోలేదని అధికారులకు ఎంపీలు వివరించారు. అనంతరం బాధితుల వివరాలు, పాస్‌ పోర్ట్‌ నెంబర్‌, చివరి సారి మాట్లాడిన సెల్‌ నెంబర్‌ ను బాధిత కుటుంబాలకు అధికారులకు అందజేశారు. తెలంగాణలో కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు ఉపాధి కోసం గల్ఫ్‌ బాట పట్టారన్నారు ఎంపీ వినోద్‌ కుమార్‌. వీసా సమయం ముగిసి, జీతాలు సరిగా లేక, ఏజెంట్ల మోసాలకు బలవుతున్నారని వివరించారు.వారిని క్షేమంగా స్వరాష్టాన్రికి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని బాధిత కుటుంబాలకు ఎంపీ భరోసా కల్పించారు. బాధితులకు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ అడిగిన అన్ని వివరాలను అందించామన్నారు. గల్ఫ్‌ దేశాల్లో మగ్గతున్న తెలంగాణ బాధితులను రక్షించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరామని స్పష్టం ఎంపీ వినోద్‌ కుమార్‌ చేశారు.