గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తే భయభ్రాంతులు తొలగిపోతాయి

సూర్యాపేట టౌన్ ( జనంసాక్షి ):ప్రతి రోజు గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తే  భయభ్రాంతులు తొలగిపోతాయని సంతోషిమాత దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ అన్నారు.దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.భక్తులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రి దేవి అని మూల మంత్రమైన గాయత్రి మంత్రాన్ని ఎవరు భక్తి శ్రద్దలతో ఉచ్చరిస్తారో వారికి అనుకున్న కోరికలు సిద్ధిస్తాయని తెలిపారు.ముక్త,విద్రుమ,హేమ, నీల ధవళ వర్ణాలు కలిగి ఐదు ముఖాలతో శంఖం,చక్ర, గద,అంకుశం ధరించి దర్శనమిస్తుందని తెలిపారు.ఆది శంకరులు సైతం గాయత్రి దేవిని అనంత శక్తి స్వరూపముగా అర్చించారని తెలిపారు.ప్రాతః కాలంలో గాయత్రిగా , మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతి గాను  ఉపాసకులతో ఆరాధనలు  అందుకుంటుందనీ తెలిపారు.ముఖంలో అగ్ని , శిరస్సులో బ్రహ్మ , హృదయంలో విష్ణువు , శఖపై  రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయనీ చెప్పారు.గాయత్రి దేవిని ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుందని,గాయత్రి ఉపాసన వలన బుద్ది తేజోవంతం అవుతుందన్నారు.గాయత్రి మంత్ర జపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.గాయత్రిదేవి అలంకరణ భక్తులకు ప్రత్యేక పూజలతోపాటు చండీహోమం, రుద్రహోమం, సుహాసినిపూజ, శ్రీ సత్యసాంబ శివ స్వామి వారికి ప్రత్యేక అభిషేకములు,భవాని మాల దీక్ష స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.నేడు అమ్మవారు అన్నపూర్ణ  దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.ఈ వేడుకల్లో దేవాలయ అధ్యక్ష , కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా , బ్రహ్మాండ్లపల్లి మురళీధర్ , కోశాధికారి పాలవరపు రామ్మూర్తి , అన్నదాన నిర్వాహకులు కొత్త మల్లికార్జున్, దేవిదత్తు,బెలిదే అశోక్, నామిరెడ్డి పాపిరెడ్డి , దేవరశెట్టి సోమయ్య , మహంకాళి ఉపేందర్ , నూకా రవిశంకర్, గాయం శ్రీదేవి , కక్కిరేని పద్మావతి , కంచర్ల లీల, అలంకార దాతలు ఎర్రమళ్ళ ప్రసాద్, దుస్సా లక్ష్మీనారాయణ , తోగిటి మురళి, దేవాలయ అర్చకులు మంగిపుడి వీరభద్రశర్మ, బాబ్జి శర్మ, దేవాలయ మేనేజర్ బచ్చుపురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.