గిరిజనులను నష్టపరిచేలా మైనింగ్ క్వారీలు
పాడేరుకు చేరుకున్న బస్సుయాత్ర
సమస్యలపై బాబుకు చిత్తశుద్ది లేదన్న మధు
విశాఖపట్టణం,సెప్టెంబర్5(జనం సాక్షి): గిరిజనుల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ వారి ప్రాణాలతో చెలగాట మాడుతున్న మైనింగ్ క్వారీ లైసెన్సును ప్రభుత్వం రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. 15న నిర్వహించనున్న మహాగర్జన సంసిద్ధతకు సిపిఎం-సిపిఐ సంయుక్తంగా చేపట్టిన సిపిఎం-సిపిఐ బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతూ బుధవారం ఉదయం ఉత్తరాంధ్ర విశాఖ జిల్లా పాడేరులో అడుగుపెట్టింది. ఉదయం 7 గంటలకు సిపిఎం, సిపిఐ, జనసేన నాయకులు కలిసి ఎడారి కోటేశ్వరరావు అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుపుతున్న కొండను పరిశీలించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ భవిష్యత్‌లో ఉద్యమాన్ని తీవ్ర ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిఎం చంద్రబాబుకు చిత్త శుద్ధి ఉంటే గిరిజన ప్రాంతాల్లో గ్రామదర్శినిలు నిర్వహించాలన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే గ్రామదర్శిని చేపడుతున్నారు కాని ప్రజా సంక్షేమం కోసం కాదని పేర్కొన్నారు. చంద్రబాబు నిర్వహించిన జ్ఞానభేరి కూడా అలాంటిదేనని తెలిపారు. అనంతరం సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ..గిరిజనుల దినోత్సవం పేరుతో విశాఖలో సిఎం చేపట్టిన ఉత్సవాలు ప్రజల్లో విషాదాన్ని నింపుతున్నాయన్నారు. సిఎం గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సిపిఎం-సిపిఐ బస్సు యాత్ర చోడవరానికి చేరింది. చోడవరం సభలో రైతులు నాయకులకు వినతిపత్రాలను సమర్పించారు. విశాఖలో షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, పాల ధరలు తగ్గి సంక్షోభంలో పడ్డామని, తమ సమస్యలను తెలుపుతూ వినతులు సమర్పించారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో రైతులు, గిరిజనులు, కార్యకర్తలు పాల్గొన్నారు.