గిరిజన నిర్వాసితులకు ఉద్యోగాలు

మనుగూరు(ఖమ్మం), న్యూస్‌లైన్‌: గిరిజన నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలతో పాటు కుంటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సింగరేణి అధికారులను శాసన సభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆదేశించారు. ఇందుకు సంబదించి ప్రభుత్వపరమైన అనుమతులను మూడు నెలల్లో ఇస్తామని చెప్పారు. ఆయన సోమవారం ఖమ్మం జిల్లా మనుగూరు ఓపెన్‌కాస్ట్‌-2ను సందర్శించారు. ఓసీల పేరుతో అడవులను నాశనం చేస్తే వన్యప్రాణులు అంతరిస్తాయని, వాటి సంరక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణ చర్యలు సంతృప్తికరంగా లేవన్నారు. గిరిజన సంస్కృతీసంప్రదాయాలకు ఎటువంటి నష్టం కలగకుండా చూడాలని సూచించారు.

‘దుమ్మూ, ధూళి అంటూ పత్రికల్లో వస్తోంది. ఇప్పుడేమిటి.. ఎటువంటి దుమ్ము లేదు. ఇటువంటి సమయాల్లో మాత్రమే పర్యావరణ చర్యలు తీసుకుంటున్నారా..? లేక, ఎప్పుడూ ఇలాగే ఉంటోందా..?! అని అధికారులను ప్రశ్నించారు. సింగరేణి పరిసర ప్రాంతాల ప్రజల కోసం చేపడుతున్న చర్యలు సంతృప్తికరంగా లేవన్నారు. కార్యక్రమంలో శాసనసభ కమిటీ  సభ్యులతో పాటు కేంద్ర మంత్రి బలరాంనాయక్‌, డిప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టివిక్రమార్క ఎస్టీ కమిటీ చైర్మన్‌ రాజన్న దొర, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, సింగరేణి సీఎండీ సుతీర్థభట్టాచార్య తదితరులు పాల్గొన్నారు.