గిరిజన పాఠశాలల్లో కుంటుపడిన విద్య

ఆదిలాబాద్‌్‌, నవంబర్‌ 15 : గిరిజన సంక్షేమ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌ వ్యవహరిస్తున్న తీరు పట్ల గిరిజన విద్య కుంటుపడుతోందని డీటీఎఫ్‌, యూటీఎఫ్‌, టీఆర్‌టీయూ సంఘాలు ధ్వజమెత్తాయి. గిరిజన సంక్షేమ శాఖలో నియమనిబంధనలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం, ప్రభుత్వ అనుమతి లేకుండా కౌన్సెలింగ్‌ నిర్వహించడం వల్ల గిరిజన విద్య గాడితప్పిందని ఆ సంఘాల నేతలు వెంకట్‌, రంగన్న, దేవేందర్‌లు ఆరోపించారు. అదే విధంగా డీడీ అక్రమంగా డిప్యుటేషన్‌ కల్పించడం వల్ల అనేక గిరిజన పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థుల చదువులు ముందుకు సాగడం లేదని అన్నారు. వెంటనే పదోన్నతులపై విచారణ జరిపి, డిప్యుటేషన్ల రద్దు చేయకపోతే అన్ని ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనకార్యక్రమాలుచేపట్టనున్నామని వారు హెచ్చరించారు. డీడీ చర్యలను నిరసిస్తూ ఈ నెల 21న జిల్లా కలెక్టరేట్‌ ఎదుట చేపట్టే ధర్నాలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు.