గిరిజన విద్యార్థులకు తప్పని తిప్పలు
డిగ్రీ కాలేజీకి సొంతభవనం పూర్తయ్యేనా?
ఏలూరు,ఆగస్ట్2(జనం సాక్షి): గిరిజన మండలమైన బుట్టాయగూడెంలో విద్యార్థులు డిగ్రీ చదివేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ డిగ్రీ కళాశాల లేకపోవడంతో అనేక మంది ఉన్నతవిద్యకు దూరం అవుతున్నారు. సుదూరంలోని జంగారెడ్డిగూడేనికి వెళ్లాల్సి రావడంతో అనేకమంది చదువును కొనసాగించలేక పోతున్నారు. ఎట్టకేలకు గత ప్రభుత్వం స్పందించి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని స్థలం కేటాయించింది. అప్పటి నుంచి స్థానిక జూనియర్ కళాశాలలో, సవిూప హాస్టళ్లలో తరగతులు నిర్వహిస్తూవస్తోంది.. సొంతభవనానికి స్థలం కేటాయించినా నిర్మాణం చేపట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. అలాగే అనేక ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులకు ఉన్నతవిద్య అందని ద్రాక్షగా మారింది.. వీరికి ప్రాథమిక విద్యే అతంతమాత్రం అందిస్తున్న ప్రభుత్వం ఇక గిరిజనుల ఉన్నతవిద్య గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా
బుట్టాయగూడెం మండలంతోపాటు సవిూప మండలాల విద్యార్థులు డిగ్రీ చదివేందుకు నానాఅవస్థలు పడుతున్నారు. గతంలో ఇక్కడ డిగ్రీ కళాశాల లేకపోవడంతో కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో అప్పటి ప్రభుత్వం కళాశాల నిర్మించేందుకు ముందుకు వచ్చింది. దీంతో ముందుగా 2009లో బుట్టాయగూడెం జూనియర్ కళాశాలలో డిగ్రీ తరగతులు నిర్వహించేందుకు
ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ తర్వాత అక్కడ తరగతుల నిర్వహణ ఇబ్బందికరంగా మారడంతో గిరిజన బాలికల వసతిగృహంలో ప్రస్తుతం తరగతులు నిర్వహిస్తున్నారు. హాస్టల్ భవనంలో తరగతులు నిర్వహిస్తుండడంతో సరైన వసతుల్లేక విద్యార్థులు నానాఅవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగా కళాశాల భవన నిర్మాణానికి నియోజకవర్గంలోని విద్యార్థులందరికీ సౌలభ్యంగా ఉండేలా బుట్టాయగూడెం నుండి కన్నాపురం వెళ్లే రహదారిలో అల్లికాల్వ వద్ద ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఈ స్థలం కేటాయించి ఏడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ భవన నిర్మాణానికి మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ స్థలంలో గత సంవత్సరం ఉపాధిహావిూ పథకంలో నీరు- చెట్టు కార్యక్రమంలో పూడికపనులు చేపట్టారు.