గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాల వసతి గృహాల్లో గిరిజనేతర విద్యార్థులను ఎలా చేర్చుతారు..?

-లక్ష్మీనగరంలో డిడి ని అడ్డగించిన ఆదివాసీ సంఘాల నాయకులు.
 వెంకటాపురం నూగూరు,జూలై  (జనంసాక్షి):-
  గిరిజన సంక్షేమ శాఖ , ఐటిడిఎ ఆధ్వర్యంలో పని చేసే ఆశ్రమ పాఠశాలల్లోని వసతి గృహాల్లో గిరిజనేతర విద్యార్థులను అనుమతించ రాదని ఐటిడిఎ డిప్యూటీ డైరెక్టర్ యాసం.పోచం కి ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం వినతిపత్రం అందజేశారు. బుధవారం లక్ష్మీనగరం ఆశ్రమపాఠశాలను సందర్శించడానికి వచ్చిన ఏటూరునాగారం ఐటిడిఎ డిడి యాసం పోచం  ని ఆదివాసీ సంఘాల నాయకులు కలిసి గిరిజన ఆశ్రమపాఠశాల వసతి గృహాల్లో  గిరిజనేతర విద్యార్థులను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఆదిమ తెగల అడవి బిడ్డల విద్యాభివృద్ధికి చెందిన  నిధులను గిరిజనేతర విద్యార్థులకు ఐటిడిఎ అధికారులు దోచి పెడుతున్నారు అని ఐక్యవేదిక ఆదివాసీ నాయకులు ఐటిడిఎ అధికారుల మీద  ఆగ్రహం వ్యక్తంచేశారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఐటిడిఎ అధికారులు గిరిజనేతర సంక్షేమం కోసం పాటు పడుతున్నారని ఆదివాసీ సంఘాల నాయకులు మండిపడ్డారు.  రాష్ట్రంలో కులాల వారిగా ఎస్సి ,బిసి ,మైనార్టీ ,సాంఘిక సంక్షేమ  వంటి విద్యా ,వసతి గృహాలు కేటాయించబడ్డాయని  అన్నారు. అందుకు ప్రభుత్వం నిధుల కేటాయింపులు కూడా చేసిందని తెలియజేశారు. గిరిజన సంక్షేమ శాఖ ,ఐటిడిఎ అధికారులు గిరిజన సంక్షేమాన్ని మరచి ,గిరిజనేతరుల అభివృద్ధి కి కృషి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నుండి ఎటువంటి అధికారిక పూర్వంగా ఆదేశాలు లేకుండా ఆశ్రమ పాఠశాలల్లోని వసతి గృహాల్లో గిరిజనేతర విద్యార్థులను చేర్చుకోవడం పైన తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఎటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా చట్టవ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్న డిడి యాసం.పోచం  ని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇప్పటికే ఆశ్రమపాఠశాల వసతి గృహాల్లో చేర్చుకున్న గిరిజనేతర విద్యార్థులను తక్షణమే బయటికి పంపించాలన్నారు.లేకుంటే ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు కొర్శా నర్సింహమూర్తి, చింత సోమరాజు ,వాసం నాగరాజు, రేగా గణేష్, పూనేం చంటి, పూనేం ప్రతాప్, ముర్రం రాజేష్, పాయం కృష్ణ, తాటి నర్సింహారావు, మడకం చిట్టిబాబు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.