గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆటోను ఢీకొన్న వాహనం: ఇద్దరు మహిళల మృతి
గుంటూరు,డిసెంబర్20( జనం సాక్షి ): గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. సోమవారం ఉదయం యడ్లపాడు 16వ
నెంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక వైపు నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట పట్టణంలోని మద్దినగర్, వ్డడెర కాలనీలకు చెందిన 14 మంది మహిళా కూలీలు పత్తిపాడు మండలం తుమ్మలపాలెంలో పత్తితీత పనులకు ఆటోలో ఉదయాన్నే బయలుదేరారు. ఈ క్రమంలో యడ్లపాడు వద్దకు రాగానే ఆటోను.. వెనుకనుంచి వచ్చిన ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తొమ్మిది మందిని స్థానికుల సహాయంతో పోలీసులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు కూలీలు మరణించారు. మృతులను షేక్ దరియాబి (55), బేగం (52) గా గుర్తించారు. మిగతా ఏడుగురిలో విూనాక్షి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆటోను ఢీకొట్టి వెళ్లిపోయిన వాహనం గురించి ఆరాతీస్తున్నారు.