గుజరాత్‌కు ఓ న్యాయం.. ఏపీకి మరో న్యాయమా?

– ఏపీపై ఎందుకంత కక్ష కట్టారు?
– పోలవరంపై మోడీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు
– పోలవరం నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు
– కాగ్‌ లేవనెత్తిన ప్రతీ అంశానికి సమాధానమిస్తాం
– డ్యామ్‌ ను చూడకుండానే జగన్‌ విమర్శిస్తున్నారు
– కేసీఆర్‌ కుటుంబ సభ్యులు పోలవరంపై కేసులు వేశారు
– ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
విజయవాడ, జనవరి3(జ‌నంసాక్షి) : గుజరాత్‌కు ఒక న్యాయం… ఆంధప్రదేశ్‌కు మరో న్యాయమా అని ప్రధాని నరేంద్ర మోడీని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రశ్నించారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఏపీ బీజేపీ కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. పోలవరం ప్రాజెక్టు గురించి ప్రధాని మోడీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని విమర్శించారు. దేశంలో డర్టీ పాలిటిక్స్‌ నడుస్తున్నాయని దేవినేని మండిపడ్డారు. దేశంలో 16జాతీయ ప్రాజెక్టుల్లో పోలవరంకు సీబీఐపీ అవార్డు వచ్చిందిని, అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తున్న పోలవరంకు ఈ అవార్డు ఇస్తున్నారని, కేంద్రమంత్రి గడ్కరీ కూడా పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారని దేవినేని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీపై కక్ష కట్టిందని, పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతోందని ఉమ ఆరోపించారు. ఇక కేసీఆర్‌ కుటుంబ సభ్యులు పోలవరంపై సుప్రీంకోర్టులో కేసు వేశారని, విభజన చట్టాన్ని గౌరవించి, పోలవరంపై కేసీఆర్‌ వేసిన కేసులు విత్‌ డ్రా చేసుకోవాలని సూచించారు. కాగ్‌ లేవనెత్తిన ప్రతీ అంశానికి సమాధానం చెబుతామని మంత్రి స్పష్టం చేశారు. గుజరాత్‌ లోని సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్ట్‌ వ్యయం 90వేల కోట్లకు చేరిందని, మూడు దశాబ్దాలు అయినా మోడీ ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. ప్రత్యేక ¬దా, కడప ఉక్కుఫ్యాక్టరీ, రైల్వే జోన్‌ గురించి మోడీ స్పందించలేదని దేవినేని మండిపడ్డ. మరోవైపు కన్నా లక్ష్మీనారాయణ, సోమువీర్రాజు, ఇతర బీజేపీ నేతలు చంద్రబాబుపై దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయనీ, 2019నాటికి డ్యామ్‌ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని అన్నారు. నిర్మాణం పూర్తయ్యే నాటికల్లా గ్రావీటితో పొలాలకు నీరు ఇస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గడ్కరీ స్వయంగా రాజ్యసభలో చెప్పారన్నారు. కేవలం 414 రోజుల్లో డయాఫ్రం వాల్‌ కట్టామని మంత్రి అన్నారు. పోలవరంలో 21.30 లక్షల క్యూబిక్‌ విూటర్ల కాంక్రీట్‌ ను వినియోగించామని దేవినేని ఉమ తెలిపారు. డ్యామ్‌ డిజైన్‌, రివ్యూ కమిటీ, పోలవరం ప్రాజెక్టు అధికారులు నాణ్యత ప్రమాణాలు, పనులపై సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. ఓ మంత్రిగా పోలవరం డ్యామ్‌ ను తాను వందలసార్లు సందర్శించానని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా అవార్డులు వస్తుంటే ఓ బాధ్యత ఉన్న ప్రధాని మోదీ పోలవరం పనులు సరిగ్గా జరగడం లేదని మాట్లాడారని విమర్శించారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ పోలవరం డ్యామ్‌ ను కనీసం సందర్శించకుండా పునాదులు కూడా లేవలేదని చెబుతున్నారని విమర్శించారు.