గుప్తిల్ ఎడమకాలికి రెండు వేళ్లే!!

గుప్తిల్ ఎడమకాలికి రెండు వేళ్లే!!
 వెల్లింగ్టన్ : ప్రపంచకప్  క్వార్టర్ ఫైనల్స్లో వెస్టిండిస్తో జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీ మోది తమ జట్టును సెమీస్కు చేర్చిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్..  స్టేడియం రూఫ్ పైకి సిక్సర్ బాదిన తర్వాత రెండు వేళ్లతో అభివాదం చేయడం వీక్షకులందరికీ గుర్తుండే ఉంటుంది. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు,  ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ మెక్మిలన్ ఒక్కడే ఇదివరకు వెస్ట్ప్యాక్ స్టేడియంలో రూప్ పైకి సిక్సర్ బాదాడు. ఆ విషయాన్నే గుర్తుచేస్తూ గుప్తిల్ రెండు వేళ్ల సంకేతాన్ని చూపాడు. అయితే గుప్తిల్ జీవితంలో రెండు వేళ్ల అంశం మరో రకంగానూ ప్రాధాన్యం ఉన్నదే! ఎలాగంటే..

అతని 13వ యేట గుప్తిల్ తన ఎడకాలి మూడు వేళ్లను పోగొట్టుకున్నాడు. ఫోర్క్ లిఫ్ట్ వాహనం అతని కాలిపైనుంచి వెళ్లడమే అందుకు కారణం. అలాంటి గుప్తిల్.. పరుగెత్తడమే ప్రధానాంశంగా ఉండే క్రికెట్ క్రీడలో రాణించడం నిజంగా గొప్పవిషయమనే చెప్పాలి. చిన్నప్పటి నుంచి క్రికెట్ నే శ్వాసించిన అతను.. ప్రపంచకప్ లోనే అత్యధిక పరుగులు(237) సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పడం వెనుక అకుంఠిత దీక్ష, పోరాట పటిమ దాగున్నాయి.  ఆసక్తి ఉండాలేగానీ విజయం సాధించేందుకు చిన్పపాటి వైకల్యాలు అడ్డురావని రుజువుచేసిన గుప్తిల్ నిజంగా గ్రేటేకదా!