గూగుల్‌లో ఇలా జరిగింది..

Google-Ruth-Porat-APఅంతర్జాతీయ మహిళా దినోత్సవం మనకు తెలుసు కదా! కానీ అంతర్జాల అన్వేషణా సంస్థ గూగుల్‌ పదిరోజుల కిందట ప్రత్యేకంగా స్త్రీల రోజుని పాటించింది! ఒక్క రోజు కాదు.. రెండు రోజులు. ఎందుకలా.. చేసింది? దీని వెనకో సంఘటన ఉంది. మూడువారాల కిందట గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ వాటాదారుల సమావేశం జరిగింది. సహజంగానే ఆ సంస్థ సీఎఫ్‌ఓ రూత్‌ పోరాట్‌ది ఇందులో కీలకపాత్ర. రూత్‌ కేవలం సీఎఫ్‌ఓనే కాదు, అమెరికాలో పేరున్న ఆర్థిక నిపుణురాలు కూడా. సమావేశంలో ఓ వాటాదారు పైకి లేచి ‘ఏమండీ మహిళా(లేడీ) సీఎఫ్‌ఓగారూ..!’ అంటూ ఏదో చెప్పాడు. అందులో తప్పేముందని అంటారా? సీఎఫ్‌ఓలాంటి అత్యున్నత స్థాయిలో ఉన్న ఓ వ్యక్తిని ప్రత్యేకంగా ‘లేడీ’ అని సంబోధించడమంటే అది ఆమె లైంగికత(జెండర్‌)ని పనిగట్టుకుని ప్రస్తావించడమే! అమెరికా సంస్కృతిలో లైంగిక వివక్షగానే పరిగణిస్తారు. దీంతో, రూత్‌కి మద్దతుగా ఉద్యోగులందరూ కలిసి ఈనెల 17, 18 తేదీలని ‘లేడీ డే’గా ప్రకటించారు. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్‌ ఉద్యోగులు చాలాచోట్ల తమ పేరూ, హోదా ముందు ‘లేడీ’ అనేపదాన్ని వాడారు. కేవలం స్త్రీలే కాదు.. మగవాళ్లూ ఆ రోజు ఇలా చేయడమే విశేషం. ఉదాహరణకు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పేరు సంతోష్‌ అనుకోండి.. ‘లేడీ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సంతోష్‌’ అంటూ ఆయన తన పేరుని రాసుకున్నారన్నమాట! ఆ రెండు రోజులూ సంస్థ ఫోన్‌ డైరెక్టరీ, ఈమెయిళ్లలోనూ పేర్లన్నీ ఇలాగే కనిపించాయి. అలా నైపుణ్యం, పదవి, ప్రతిభ ఇవన్నీ స్త్రీ, పురుష భేదానికి అతీతమైనవని చెప్పడమే తమ ఉద్దేశమని గూగుల్‌ సిబ్బంది చెప్పకనే చెప్పారు.