గెలిచి ఓడిన వికాస్ కృష్ణన్
లండన్ ఒలింపిక్స్ బాక్సింగ్‌లో మరో వివాదం
లండన్ ఆగస్టు 4 : లండన్ ఒలింపిక్స్ వివాదాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలు క్రీడలలో జడ్జీల తీర్పులు వివాదాస్పదమవడం, ఫిక్సింగ్ దుమారం చెలరేగడం వంటివి చోటు చేసుకుంటుంటే.. తాజాగా బాక్సింగ్‌లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈ సారి కూడా బలైంది భారత బాక్సరే.. పురుషుల 69 కేజీల విభాగంలో వికాస్ కృష్ణన్ మ్యాచ్ ఫలితం పెద్ద దుమారం రేపింది. ముందు వికాస్ గెలిచినట్టు ప్రకటించిన జడ్జీల నిర్ణయం కాదంటూ రిఫరీ, ఎఐబిఎ తలదూర్చి ఫలితాన్ని మార్చేశారు. అమెరికా బాక్సర్‌తో తలపడిన వికాస్ 13-11తో నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నట్టు జడ్జీలు ప్రకటించారు. అయితే అమెరికా మేనేజ్‌మెంట్ ఈ ఫలితాన్ని వ్యతిరేకించింది. భారత బాక్సర్ ఫౌల్స్ చేశాడని, తమ బాక్సరే గెలిచాడంటూ హంగామా చేశారు. దీంతో రంగంలోకి దిగిన రిఫరీ వీడియో ఫుటేజ్ ఆధారంగా వికాస్ ఓడిపోయాడని మళ్లీ ప్రకటించాడు. అతను చేసిన తొమ్మిది ఫౌల్స్‌ను జడ్జీలు పరిగణలోకి తీసుకోలేదని, అందుకే ఆమెరికా బాక్సర్ ఓడినట్టు ప్రకటిచాంరని వివరణ ఇచ్చాడు. అంతే కాకుండా మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించిన జడ్జీలను సస్పెండ్ చేశారు. ఈ పరిణామంతో విస్తుపోయిన భారత జట్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏకంగా తొమ్మిది ఫౌల్స్ చేశాడని చెబుతోన్న రిఫరీపై మండిపడ్డారు. మరి జడ్జీలు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ వివాదంపై అటు భారత ఒలింపిక్ సంఘం కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే సుమిత్ సంఘ్వాన్ మ్యాచ్ ఫలితం కూడా వివాదాస్పదంగానే వెలువడింది. దీంతో వికాస్ ఫలితంపై గట్టిగా పోరాడాలని భారత జట్టు నిర్ణయించింది. మొత్తం వ్యవహారంపై ఒలింపిక్స్ నిర్వాహకులకు, జ్యూరీ ప్యానెల్‌కు ఫిర్యాదు చేశారు. ఎట్టిపరిస్థుతుల్లోనూ రిఫరీ తీర్పును అంగీకరించమని భారత చీఫ్ ది మిషన్ రాజా ప్రకటించారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.