గెలిపించండి.. దత్తత తీసుకుంటాం
` జన్‌ధన్ ఖాతాల్లో రూ. 15 లక్షలు పడితే మోడీకి ఓటేయండి
` డబ్బులు రాని వారు టిఆర్‌ఎస్‌కు ఓటేయండి
` మోడీని నమ్ముకుంటే నిండా ముంచుతున్నాడు
` మన యాదాద్రికి ఒక్క పైసా ఇవ్వని పరమ హిందువు
` చేనేతకు మరణశాసనం రాసిన ఘనుడు మన మోడీ
` కూసుకుంట్ల నామినేషన్ ర్యాలీలో బీజేపీపై మండిపడ్డ కెటిఆర్
నల్లగొండ(జనంసాక్షి):టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే.. మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. జన్‌ధన్ ఖాతాల్లో 15 లక్షలు పడ్డవాళ్లు మోడీకి ఓటేయండి..పడని వాళ్లు టిఆర్‌ఎస్‌కు ఓటేయండని అంటూ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మునుగోడు ప్రజలకు పిలుపును ఇచ్చారు. ఎవరి ఖాతాల్లో అయినా 15 లక్షలు పడ్డాయా అంటూ ప్రజలను ప్రశ్నించారు. అబద్దాలతో పాలన చేస్తూ.. మోడీ దేశాన్ని అమ్ముకుంటున్నాడని మండిపడ్డారు. కెసిఆర్ ఫామ్ హౌజ్‌లో పడుకుంటున్నాడని విమర్విస్తున్న వారికి సైతం కెటిఆర్ కౌంటర్ వేశారు. ఆయన పడుకుంటే ఈ పథకాలన్నీ ఎలా వస్తున్నా యని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కేటీఆర్ ప్రసంగించారు. చేనేత విూద పన్ను విధించిన మొట్టమొదటి ప్రధానమంత్రి, దుర్మార్గపు ప్రధాన మంత్రి మోదీ అంటూ విరుచుకు పడ్డారు. చేనేతకు మరణశాసనం రాసింది మోదీనే. ఆయన కంటే ముందున్న 14 మంది ప్రధానమంత్రులు చేయని దుర్మార్గాన్ని చేసి, చేనేతకు మరణ శాసనం రాశారని అన్నారు. ఈ రోజు చేనేత విూద 5 శాతం జీఎస్టీ విధించారు. చేనేత బంద్ అయిపోయే రోజును మోదీ తీసుకొస్తరు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేశాడు. నేతన్నకు ఇచ్చే బీమా పథకాన్ని ఎత్తేశాడని కెటిఆర్ అన్నారు. కేసీఆర్ మాత్రం చేనేత మిత్ర పేరుతో 40 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. ఎన్నికలు రాగానే ఆగమాగం మాటలు చెబుతున్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే.. ఈ నియోజకవర్గానికి రూ. 1000 కోట్లు ఇస్తానని అమిత్ షా చెప్పిండు అని రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుండు. ఉప ఎన్నిక వచ్చిన చోటల్లా ఇదే మాట చెబుతారు. ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. పచ్చి మోసగాళ్లు బీజేపీ నాయకులు. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారుని మండిపడ్డారు. రైతన్న, గీతన్న, నేతన్న కోసం పని చేసే నాయకుడిని గెలిపించుకుందాం. సాగునీటి ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చడం లేదు. 811 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమకు రావాల్సిన 575 టీఎంసీలు ఇవ్వాలని కోరాం. కానీ స్పందన లేదు. నీళ్లలో వాటా తేల్చకుండా చావగొడుతున్నారు. కేసీఆర్‌కు మంచి పేరు రాకుండా మోదీ ఆగం చేస్తున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. నవంబర్ 6 తర్వాత ప్రతి మూడు నెలలకొకసారి వచ్చి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తాను. అభివృద్ధిలో అండగా ఉంటాను. రోడ్లను అభివృద్ధి చేస్తాను. నా మాట విూద విశ్వాసం ఉంచండి. తప్పకుండా అభివృద్ధిలో పయనిద్దాం. మునుగోడును అభివృద్ధిలో ముందంజలో ఉంచేందుకు కృషి చేద్దామని కేటీఆర్ పేర్కొన్నారు.కేసీఆర్‌కు మునుగోడు కష్టం తెలుసన్నారు. 2006లో 32 మండలాలు తిరుగుతూ.. ఆయన స్వయంగా పాట రాశారు. తాగునీటి మంత్రి జానారెడ్డి, సాగునీటి మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అయిండు. ఏ ఒక్కరూ కూడా మంచి చేయలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత, విూ ససమస్యను పరిష్కరిస్తామని చెప్పి, ఇచ్చిన హావిూని కెసిఆర్ నెరవేర్చారు. నల్లగొండ జిల్లాకు అనుకొని కృష్ణా నది వెళ్తున్నప్పటికీ, తాగు, సాగునీటి సమస్య పరిష్కరించలేదు. రిజర్వాయర్లు కట్టలేదు. తాగునీరు ఇవ్వలేదు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో చెర్లగూడెం, శివన్నగూడెం రిజర్వాయర్ కట్టి రెండున్నర లక్షలకు నీరు ఇవ్వబోతున్నాం. లక్ష్మణపల్లి రిజర్వాయర్ చేపట్టాం. చెరువులను నింపుతున్నాం అని వివరించారు. లక్షా 13 వేల మందికి రైతుబంధు సాయం అందుతుంది. 10 ఏండ్లకు ముందు మునుగోడు ఎలా ఉండే..? ఇప్పుడు మునుగోడు ఎలా ఉందో? ఆలోచించాలి. ఒకప్పుడు రాత్రి సమయాల్లో బావుల వద్దకు వెళ్లి మోటార్లు వేసుకునే వాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. ఉమ్మడి ఏపీలో విత్తనాలు పోలీసు స్టేషన్‌లో పెట్టి ఇచ్చేవారు. అవి కూడా కల్తీ విత్తనాలే. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబీమా అమలు చేస్తున్నాం. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా.. వారం రోజుల్లో రూ. 5 లక్షలు ఇస్తున్నాం. తాగు, సాగునీటితో పాటు కరెంట్ సమస్యలను పరిష్కరించుకున్నాం. ప్రధానులు పట్టించుకోని సమస్యను కేసీఆర్ పరిష్కరించారు. 1996లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో 400 మంది నామినేషన్లు వేసి దేశ దృష్టిని ఆకర్షించారు. కానీ పరిష్కారం దొరకలేదు. కేసీఆర్ వచ్చాక ఎª`లోరోసిస్ సమస్యకు శాశ్వత విముక్తి కల్పించామని కేటీఆర్ పేర్కొన్నారు. పెద్ద హిందువునని చెప్పుకుంటున్న మోడీ యాదగిరి గుట్ట నర్సింహస్వామి ఆలయ నిర్మాణానికి రూ.100 కోట్లు ఇవ్వమని అడిగితే.. కనీసం100 రూపాయలు కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. యాదాద్రి ఆలయాన్ని తిరుపతికి ధీటుగా అభివృద్ధిచేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. దేవుళ్లను రాజకీయం కోసం వాడుకోవడం తప్ప బీజేపీకి మరేంత తెలియదని చెప్పారు. చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించిన మోడీ సర్కారు.. చేనేత వృత్తికి మరణ శాసనం రాసే ప్రయత్నం చేసిందన్నారు. ఒకవేళ బీజేపీ అధికారంలో కొనసాగితే చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆలిండియా పవర్ లూమ్ బోర్డును ప్రధాని మోడీయే రద్దు చేశారని తెలిపారు. నేత కార్మికులకు పనికొచ్చే ఒక్క పనిని కూడా మోడీ చేయలేదన్నారు. ఇది బలవంతంగా ప్రజలపై రుద్దిన ఎన్నిక. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హావిూని కూడా బీజేపీ నిలబెట్టుకోలేదు. ఒక్క రూపాయిని కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. ఎక్కడ ఎన్నిక వస్తే అక్కడ వెయ్యి కోట్లు ఇస్తమని బీజేపీ వాళ్లు ప్రకటిస్తున్నరు. మునుగోడు లోనూ అదే విధమైన బూటకపు హావిూలు ఇస్తున్నరు. వాటిని నమ్మి ప్రజలు మోసపోవద్దని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘చేసేదేమో పకోడీల పని… చెప్పేదేమో కోట్ల మాట‘ అనేలా మోడీ మాటలు ఉన్నాయని మండిపడ్డారు. ర్యాలీలో మంత్రి జగదీశ్ రెడ్డి, సిపిఐ, సిపిఎం నేతలు, అభ్యర్థి కూసుకుంట్ల తదితరులు పాల్గొన్నారు.