గొరిగెనూరు గ్రామంలో వైకాపా నేతల పర్యటన

మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి తీరుపై మండిపాటు

కడప,నవంబర్‌23(జ‌నంసాక్షి): 144 సెక్షన్‌ అమల్లో ఉన్న జమ్మలమడుగు మండలంలోని గొరిగెనూరు గ్రామంలో కడప మాజీ ఎంపి వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, జమ్మలమడుగు వైసిపి సమన్వయకర్త సుధీర్‌ రెడ్డిలు శుక్రవారం పర్యటించారు. ఇటీవల గొరిగెనూరు గ్రామంలోని తలారి సామాజిక వర్గానికి చెందిన 35 కుటుంబాలు వైసిపిలో చేరడానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కడప మాజీ ఎంపి వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, జమ్మలమడుగు వైసిపి సమన్వయ కర్త సుధీర్‌ రెడ్డిలను గృహ నిర్బంధం చేశారు. దీంతో వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పర్యటించే స్వేచ్ఛ ఉందని న్యాయస్థానం చెప్పడంతో..ఈ రోజు ఉదయం అవినాష్‌ రెడ్డి, సుధీర్‌ రెడ్డి లు ఇద్దరూ కలిసి 144 సెక్షన్‌ గ్రామంలో ఉండటంతో ఎలాంటి కాన్వాయ్‌ లేకుండా పర్యటించారు. ఈ సందర్బంగా అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా నియోజకవర్గంలోని 7 గ్రామాలకు మంత్రి ఆది నారాయణ రెడ్డి వల్ల స్వాతంత్య్రం రాలేదని విమర్శించారు. భవిష్యత్‌లో ఈ గ్రామాలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛను వైసిపి తీసుకువస్తుందని పేర్కొన్నారు.