గోదావరి బ్యారేజీల వద్ద వరద ఉధృతి
సముద్రంలోకి వదులుతున్న అధికారులు
ఉధృతంగా ప్రవహిస్తున్న ఉపనదులు
ఏలూరు,ఆగస్ట్21(జనం సాక్షి): గోదావరి కాటన్ బ్యారేజీల వద్ద వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. కాస్త శాంతించిన గోదారమ్మ సోమవారం నుంచి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతుంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలకు ఎగువ నుంచి గోదావరి నదిలోకి వరద నీరు భారీగా వచ్చిచేరుతోంది.అధికారులు ఎప్పటికప్పుడు వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నా గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. భద్రాచలం, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటి మట్టాలు పెరుగుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాలైన కుంట, కొయిదా, పేరూరి, భధ్రాచలం ప్రాంతాలలో కురుస్తున్న భారీవర్షాలతో ప్రాణహిత, శబరి, పెనుగంగ, మంజీర ఉప నదుల నుంచి గోదావరి నదిలోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. గోదావరి ఉధృతి క్రమక్రమంగా పెరగడంతో ధవళేశ్వరం హెడ్‌వర్క్స్ అధికారులు సోమవారం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రాత్రికి స్పల్పంగా తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం హెడ్ వర్క్స్ అధికారులు మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి నీటి మట్టం 15.02 విూటర్లుగా నమోదైంది. కాటన్ బ్యారేజీల సామర్థ్యం మేరకు నీటి విడుదలను క్రమబద్ధీకరిస్తున్నారు. ధవళేశ్వరం, విజ్జేశ్వరం, మద్దూరులంక, బొబ్బర్లంకల వద్ద గోదావరి నదిపై ఉన్న కాటన్ బ్యారేజీల గేట్లను పూర్తిగా ఎత్తివేసి సోమవారం సాయంత్రం నాటికి 13.65 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమవారం నీటిమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. కొవ్వూరులో గోష్పాద క్షేత్రం మళ్లీ వరద ముంపునకు గురైంది. వరద ముంపు నుంచి బయటపడినప్పటికీ మళ్లీ ఎగువ నుంచి వరద ప్రవాహం భారీగా వస్తుండడంతో సోమవారం ఉదయం రెండోసారి ముంపు బారిన పడింది. సుమారు మూడు అడుగుల మేరకు క్షేత్రంలో నీరు ప్రవహిస్తుంది. వరద ఉధృతి పెరగడంతో క్షేత్రంలోని ఆలయాలను మూసి వేశారు. భారీవర్షాల నేపథ్యంలో దేవరపల్లి, కొవ్వూరు మండలాల్లో ఉన్న సుమారు 132 క్వారీలు, 150 వరకు క్రషర్లు మూతపడ్డాయి. క్వారీల్లో వర్షపు నీరు చేరడంతో పాటు వాహనాల రాకపోకలకు అనువుగా లేకపోవడం తవ్వకాలు నిలిపివేశారు.