గ్యాస్ ఏజెన్సీల బ్లాక్ దందా – పత్తాలేని పౌరసరఫరాల అధికారులు
హత్నూర (జనం సాక్షి)
అక్రమార్జనకు అలవాటు పడిన గ్యాస్ ఏజెన్సీదారులు బ్లాక్ దందాను ఎంచుకుంటున్నారు.సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.ఇంట్లో వంటకు ఉపయోగించే సిలిండర్లను వ్యాపార,వాణిజ్య సముదాయాల వినియోగాలకు విక్రయిస్తూ అడ్డగోలుగా దండుకుంటున్నారు.మండల కేంద్రమైన హత్నూర, కాసాల(దౌల్తాబాద్),సిరిపుర,గ్రా మాలు వ్యాపార, వాణిజ్య పరంగా కొంత అభివృద్ధి చెందిన ప్రాంతాలు కావడంతో అక్కడ అనేక రకాల దుకాణ సముదాయాలు ఏర్పడ్డాయి.టీపాయింట్లు,హోటళ్ళు , ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు,బిర్యానీ పాయింట్లు,టిఫిన్ సెంటర్లు లాంటివి ఎన్నో వెలిశాయి.వీటిని అవకాశంగా మార్చుకున్న గ్యాస్ ఏజెన్సీదారులు అక్రమంగా వారికి గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు.ఒక్కో గ్యాస్ సిలిండర్ ధరపై 3వందల నుండి 5వందల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం.ఇంట్లో వంటలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ గా వాడడం చట్ట విరుద్ధం అయినప్పటికీ వ్యాపారస్తులు అవేవీ పట్టించుకోకుండా యదేచ్ఛగా గ్యాస్ ను వినియోగిస్తున్నారు.బ్లాక్ దందాను అరికట్టాల్సిన సంబంధిత పౌరసరఫరాల అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.నిబందనలకు విరుద్ధంగా వంట గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ గా వాడుతున్న వ్యాపారస్తులపై,వారికి సరఫరా చేస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై ఎలాంటి చర్యలు తీసుకోని సంబంధిత పౌరసరఫరాల అధికారులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.