న్యూఢిల్లీ: ఇప్పటికే నిత్యవసరాల సరుకులు, ఇంధన ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే వారికి కాస్త ఊరట కలిగించేలా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన కొత్త రేటు ప్రకారం అంటే ఆగస్టు 1న, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 36 తగ్గింది.
నెల వ్యవధిలో రేట్లు తగ్గించడం ఇది రెండోసారి. జూలై 6న 19 కేజీల సిలిండర్‌పై రూ.8.50 తగ్గించారు. ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1,976గా ఉండగా అంతకు ముందు రూ. 2,012.50 ఉంది. కోల్‌కతాలో ఈ ధర రూ.2,095.50, ముంబైలో రూ.1,936.50, చెన్నైలో రూ.2,141 ఉంది. కాగా స్థానిక టాక్స్‌ల ఆధారంగా రాష్ట్రానికి రాష్ట్రానికి ఈ సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.