గ్రహణమొర్రి బాధితులకు నిమ్స్ ఉచిత చికిత్సా శిబిరం
ఆదిలాబాద్, నవంబర్ 23 : గ్రహణం ద్వారా అంగవైకల్యం సోకిన బాధితులు బయపడవద్దని వారికోసం నిమ్స్ హాస్పిటల్ వైద్యులు ముందుకు వచ్చి ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.అశోక్ పేర్కొన్నారు. శుక్రవారంనాడు డి.ఆర్.డిఎ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన గ్రహణమొర్రి ఉచిత చికిత్సా శిబిరంలో ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ జిల్లాలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు గ్రహణం సోకి అంగవైకల్యంతో బాధపడుచున్నవారికి నిమ్స్ హాస్పిటల్ వైద్యులు ఉచితంగా సేవలు అందిస్తున్నందుకు వారిని అభినందించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఇందిరాక్రాంతి పథం(ఐకెపి) ఆధ్వర్యంలో నిమ్స్ హాస్పటల్ హైదరాబాద్ వారు ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులు, 24న మంచిర్యాల ఐకెపి కార్యాలయంలో గ్రహణ మొర్రి సోకి అంగవైకల్యం పొందిన వారికి హైదరాబాద్ నుండి వచ్చిన వైద్యులు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి వారిని నిమ్స్ హాస్పటల్ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఉచిత చికిత్సలు అందిస్తారని ఈ అవకాశాన్ని పేదలు వినియోగించుకోవాలని క్యాంపుకి హాజరైన లబ్దిదారులను కోరారు. చికిత్స శిబిరానికి 15మంది హాజరుకాగా పరీక్షించిన తరువాత వారిని 25న ఆదివారం నిమ్స్ హాస్పటల్ హైదరాబాద్‌కు రావలసిందిగా తెలిపారు. వారికి రానుపోను ఖర్చులు, భోజనవసతి కల్పించి ఇతర ఖర్చులకు రూ.1000లు చెల్లిస్తారని తెలిపారు. ఈ చికిత్సల గురించి ప్రజలకు తెలిసే విధంగా ఐకెపి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు, అంగన్‌వాడి కార్యకర్తలు ద్వారా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని డిఆర్‌డిఏ, పి.డి, పిడి ఐసిడియస్‌లకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పిడి డిఆర్‌డిఏ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.