గ్రామ కార్యదర్శిని నిలదీసిన ప్రజలు
డోర్నకల్ సెప్టెంబర్ 10 జనం సాక్షి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల పరిధి ఆందనాలపాడు గ్రామ కార్యదర్శిని శనివారం కొత్త తండా ప్రజలు అడ్డుకున్నారు.అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు.స్థానికులు గాంధీ,గుగులోతు సుజాత మాట్లాడుతూ.. తనను నర్సరీ పనిలోకి తీసుకుంటానని రూ.2,000 లంచం తీసుకున్నట్లు తెలిపారు.కొంతమంది మహిళలను మభ్యపెట్టి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపించారు.గ్రామంలో నూతన గృహ నిర్మాణానికి పర్మిషన్ కు రూ.20,000 డిమాండ్ చెయ్యగా రూ.3,000 ముట్టచెప్పినట్లు తెలిపారు.మరో వెయ్యి కావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.ఆసరా పింఛన్ల ఆన్లైన్ పేరుతో ఒక్కొక్కరి నుంచి1,000 నుంచి1,500 తీసుకున్నట్లు వెల్లడించారు.కార్యదర్శి బాధితులు ఇంటికొకరున్నట్లు ఆరోపించారు.అవినీతికి అలవాటు పడిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.కార్యదర్శి తను తీసుకున్న డబ్బులను గడువులోగా తిరిగి బాధితులకు చెల్లిస్తానని చెప్పడం గమనార్హం.ఇట్టి విషయమై ఎంపీడీవో అపర్ణను వివరణ కోరగా.. కార్యదర్శి పై వస్తున్న అవినీతి ఆరోపణలపై బాధితుల ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు తెలిపారు.