గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి
– జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): జిల్లాలో నిర్వహించబోయే గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించటానికి పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ఆదేశించారు.సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను సంబంధిత అధికారులు,అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావుతో కలిసి సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 16న సూర్యాపేటలో 31 కేంద్రాల్లో నిర్వహించే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కు 9,181 అభ్యర్థులు హాజరవుతున్నట్లు తెలిపారు.దీనికిగాను 12 మంది లైజన్ ఆఫీసర్లు , 31 మంది చీఫ్ సూపర్డెంట్లు , 31 మంది అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. పరీక్షలను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు నిర్వహణ ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాలన్నింటిలోనూ త్రాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు ఉండాలన్నారు.వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.అన్ని పరీక్ష కేంద్రాలలో ప్రధానంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించారని, పరీక్ష సమయానికి గంటన్నర ముందుగా హాజరుకావాలని, పరీక్ష రాసే అభ్యర్థులు తప్ప మరేవరికీ పరీక్షా కేంద్రంలో అనుమతి లేదని కలెక్టర్ పేర్కొన్నారు.పరీక్షా సమయం ముగిసేంతవరకు ఎవరిని బయటకు అనుమతించ వద్దని ఆదేశించారు.రూట్ ఆఫీసర్స్ తో పాటుగా పోలీస్ సిబ్బంది కూడా ఉండాలన్నారు.పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి బందోబస్తు పకడ్బందిగా ఉండాలని డిఎస్పి నాగభూషణంకు కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా సమయంలో నిరంతర విద్యుత్తు ఉండేలా విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.ఇన్విజిలేటర్స్ తమ విధుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.మీటింగ్ అనంతరం అందరూ అధికారులు పరీక్ష కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు, ఇన్చార్జ్ డిఆర్ఓ రాజేంద్ర కుమార్ , కలెక్టరేట్ ఏవో శ్రీదేవి , జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ , అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Attachments area