ఘనంగా ఎన్టీఆర్‌ వర్ధంతి వేడుకలు

నివాళి అర్పించిన టిడిపి నేతలు

నెల్లూరు,జనవరి18(జ‌నంసాక్షి): ఎన్టీఆర్‌ 23వ వర్ధంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, అఖిల భారత ఎన్టీఆర్‌ అభిమాన సంఘ అధ్యక్షుడు తాళ్లపాక రమేశ్‌ రెడ్డి, జిల్లా తెదేపా పార్టీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను ఏర్పాటు చేశారు. నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ప్రారంభించారు. స్థానిక వర్తక వీధిలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ చేసిన సేవలను కొనియాడారు. రాజకీయ, సినీ రంగాల్లో రాణించారని పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టి నేడు అందిరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగు దేశం పార్టీని 2019 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధ, నుడా ఛైర్మన్‌ శ్రీనివాసులు రెడ్డి, నగర పార్టీ ఇన్‌ఛార్జి ఎం శ్రీధర్‌ కృష్ణా రెడ్డి, కార్పొరేటర్లు, జిల్లా పార్టీ నాయకులు పాల్గొన్నారు.