ఘనంగా బోస్‌ జయంతి వేడుకలు

ఆయన ఆదర్శాలునేటికీ అనుసరణీయం

తిరుపతి,జనవరి23(జ‌నంసాక్షి): సుభాష్‌ చంద్రబోస్‌ సేవలు నేటికీ యువతకు ఆదర్శమని పలమనేరు పరిరక్షణ సమితి కార్యదర్శి నరసింహులు పేర్కొన్నారు. పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ… స్వాతంత్యోద్యమ్రంలో బోస్‌ అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి దేశ భక్తిని చాటుకున్నారన్నారు. చంద్రబోస్‌ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. శ్రీపురం సీతారామయ్య మాట్లాడుతూ.. మహనీయుల సేవలను గుర్తించి వారి జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోష దాయకమని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవా, దవణముని, బాలరాజు, దేవారాజులు, ప్రభాకర్‌ బాలసుబ్రమణ్యం, శివ, దొరస్వామి, కృష్ణారెడ్డి, పలువురు పిపిఎస్‌, హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సభ్యులు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కవిటిలో ఘనంగా జయంతి వేడుకలు

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా బుధవారం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బెజ్జిపుట్టుగ గ్రామంలో సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులంతా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. బెజ్జిపుట్టుగ, మాణిక్యపురం తదితర గ్రామాల్లోనూ నేతాజీ సుభాస్‌ చంద్ర బోస్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మండల విద్యాశాఖ అధికారి ధనుంజయతో పాటు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.