ఘనంగా భజ్జీ పెళ్లి విందు
భారత సీనియర్ క్రికెటర్, టర్బోనేటర్ హర్భజన్ సింగ్ – బాలీవుడ్ నటి గీతా బస్రాల వివాహమహోత్సవ ఘట్టం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత అతిరథమహారథులకు హస్తినలో ఘనమైన విందు ఇచ్చారు. భజ్జీ దంపతుల వెడ్డింగ్ రిసెప్షన్ దేశ రాజధానిలోని తాజ్ ప్యాలెస్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బాలీవుడ్ తారలు, టీమిండియా మాజీ.. ప్రస్తుత క్రికెటర్లు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రధాని మోడీ యువ దంపతులను ఆశీర్వదించి వారితో కాసేపు ముచ్చటించారు.
కాగా, భజ్జీ-బస్రాల వివాహం గురువారం జలంధర్‌లో కన్నుల పండువగా జరిగిన విషయం తెల్సిందే. ఈ వివాహ విందుకు మొత్తం వెయ్యిమంది ప్రముఖులను హర్భజన్ స్వయంగా ఆహ్వానించాడు. వివాహానికి గైర్హాజరైన సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్, టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీలు విందు భోజన కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. అలాగే, ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా, భారత మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే దంపతులతో పాటు టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి, వన్డే కెప్టెన్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.