ఘనంగా వీడ్కోలు సమావేశం

అచ్చలాపూర్‌(తాండూర్‌),న్యూస్‌టుడే: తాండూర్‌ మండలం అచ్చలాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్ధులకు సోమవారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్ధులు సాంస్కృతిక ప్రదర్సనలతో అలరించారు. తొలుత ఉదయం ఉపాద్యాయులు విద్యార్ధులకు పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అన్ని విషయాల ఉపాద్యాయులు ఆయా విషయాల్లో పరీక్షకు సిద్దపడే విధానాలను, మార్కులు ఎక్కువగా సాధించే పద్ధతులను వివరించి చెప్పారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాఠశాలకు స్ధలాన్ని విరాళంగా ఇచ్చిన విశ్రాంత ఇంజనీరు విజయ్‌ కుమార్‌ హజరై మాట్లాడారు. మారుమూల గ్రామం, ప్రభుత్వ పాఠశాల అని ఆలోచించకుండా విద్యార్ధులు చదువుల్లో దూసుకువెళ్లాలని సూచించారు. విద్యార్ధులకు వసతులు, సౌకర్యాలను కల్పించెందుకు ఎన్నో సాయం చేసే చేతులు వస్తాయని ప్రతికూల పరిస్ధితులను లెక్క చేయకుండా రాణించి గ్రామానికి, పాఠశాలకు పేరు తేవాలని ఆయన ఈన్నారు. అనంతరం బాలికలు ఆటపాటలు, ఉపన్యాసాలు, హస్య నాటికలు, నృత్యాలతో అలరించారు. 9వ తరగతి విద్యార్ధులు అన్నీ తామై కార్యక్రమాన్ని నడిపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటి ఉపాద్యాక్షుడు పుప్పాల తిరుపతి, ప్రదానోపాద్యాయులు రవీందర్‌, ఉపాద్యాయులు, విద్యార్ధులు పాల్గోన్నారు.