చందగ్రహణంతో నేడు తిరుమల ఆలయం మూసివేత
పరిమితంగా దర్శనాలకు అనుమతి
తిరుమల,జూలై26(జనంసాక్షి): చందగ్రహణాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం శుక్రవారం మూతపడనుంది. శుక్రవారం రాత్రి 11.54 గంటల నుంచి శనివారం వేకువజాము 3.49గంటల వరకు చందగ్రహణం సంభవించనుంది. గ్రహణం మొదలయ్యే సమయానికి ఆరు గంటల ముందుగా ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5గంటలకు ఆలయ తలుపులను మూసివేసి గ్రహణం వీడిన తర్వాత శనివారం వేకువజామున 4.15గంటలకు తెరుస్తారు. ఆ వెంటనే సుప్రభాత సేవతో పాటు శుద్ధి, పుణ్యాహవచనం చేస్తారు. అనంతరం తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించి, ఉదయం 7గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గ్రహణం నేపథ్యంలో గురువారం అర్థరాత్రి వరకు దర్శనం చేయిస్తారు. ఇంకా మిగిలినవారికి శుక్రవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల లోపే దర్శనం కల్పిస్తారు. అభిషేకం కారణంగా శుక్రవారం దర్శనం ఆలస్యంగా మొదలవుతుంది. దీంతో కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకే వీఐపీ టికెట్లను పరిమితం చేశారు. అలాగే రూ.300 టికెట్లు, స్లాటెడ్ దివ్య, సర్వదర్శనం టోకెన్ల జారీని ఇప్పటికే రద్దు చేశారు. భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తిచేశారు. గ్రహణం కారణంగా శుక్రవారం మధ్యాహ్నం భోజనం వితరణ తరువాత అన్నదాన సముదాయాలు, కౌంటర్లు మూసివేస్తారు. చందగ్రహణం సందర్భంగా 27న నిర్వహించాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్ర¬్మత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ, పున్నమి గరుడసేవలను రద్దు చేశారు.