చంద్రగ్రహణంతో ప్రధాన ఆలయాల మూసివేత

కరీంనగర్‌,ఏప్రిల్‌ 1 :  ఏప్రిల్‌ 4న చంద్రగ్రహణం పురస్కరించుకుని పలు ఆలయాలను మూసివేయనున్నారు. ఆనాడు జిల్లాలో ప్రధాన ఆలయాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మూతపడనున్నాయి. ఇందులో వేములవాడ, ధర్మపురి, కొండగట్టు ఆలయాలు ఉన్నాయి. దీంతో

చిన్న హనుమాన్‌ జయంతి ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు దీక్షాపరులకు చందగ్రహణం కారణంగా అసౌకర్యం ఏర్పడనుంది. 4న చిన్న హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ఉన్నప్పటికీ చందగ్రహణం కారణంగా ఆరోజు ఉదయం 8గంటల నుంచి 5వ తేదీ ఉదయం 3గంటల వరకు ఆలయ కవాట బంధనం ఉంటుందని ఆలయ ఈవో నర్సింహులు తెలిపారు. 5న ఉదయం ఆలయ సంప్రోక్షణ గావించి దీక్షాపరులను అంజన్న దర్శనానికి అనుమతించడానికి ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. ఉత్సవాలను పురస్కరించుకొని  అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గ్రహణం సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం మూసి ఉంటుందని ఆలయ ఈవో దూస రాజేశ్వర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ఉదయం 7 గంటల నుండి రాత్రి 8.05 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఆయన తెలిపారు.