చంద్రబాబు విజన్ ఉన్న నేత
– అమరావతి నిర్మాణం సజావుగా జరగాలి
– 17 ప్రాంతీయ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో బాబు సఫలమయ్యాడు
– కర్ణాటక సీఎం కుమారస్వామి
– కుటుంబ సమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకున్న కుమారస్వామి
విజయవాడ, ఆగస్టు31(జనం సాక్షి) : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్ ఉన్న నాయకుడని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. శుక్రవారం ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని కుమారస్వామి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో, అర్చకులు వారికి పూర్ణంకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు.. శ్రావణమాసం సందర్భంగా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు. ముందుచూపున్న నేతగా చంద్రబాబు పేరుందని, ఏం చేసినా కచ్చితంగా క్లారిటీగా ముందుకెళ్లే నేత చంద్రబాబు అని కొనియాడారు. రాజధాని లేని రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని కుమారస్వామి అన్నారు. అమరావతి నిర్మాణం సజావుగా జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. అలాగే 17 ప్రాంతీయ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకు రావడంలో చంద్రబాబు సఫలమయ్యారని, చంద్రబాబుతో జరిగిన భేటీలో ప్రస్తుత రాజకీయాలపై చర్చించామన్నారు. అలాగే చంద్రబాబు నాయకత్వంలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించామని కుమారస్వామి అన్నారు. రాబోయే కాలంలో పలుమార్లు భేటీ అయ్యి జాతీయ స్థాయిలో, దక్షిణాది ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంపై దృష్టిసారిస్తామని తెలిపారు. కుమారస్వామి వెంట ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు తదితరులు ఉన్నారు.
కుమారుడి పెండ్లి కోసం..
తన కుమారుడు నిఖిల్ పెళ్లి చూపుల కోసం ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత బొడేపూడి శివ కోటేశ్వరరావు నివాసానికి చేరుకున్నారు కుమార స్వామి దంపతులు… కుమార స్వామి దంపతుల వెంట విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఉన్నారు. తన కుమారుడు నిఖిల్‌కి కోటేశ్వరరావు కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలకు భావిస్తుండగా… ఆమెను చూసేందుకు కోటేశ్వరరావు నివాసానికి వచ్చారు కుమారస్వామి దంపతులు.