చంద్రబాబు వెళ్లిపోయిన తరువాతే..  తొక్కిసలాట జరిగింది


– ముహూర్త కాలంపై ప్రచారంతో ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు
– ప్రమాదం జరిగిన ఘాట్‌ వెడల్పు 300 విూటర్లు మాత్రమే ఉంది
– తోపులాట జరగడంతో ప్రాణనష్టం జరిగింది
– గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటపై సోమయాజులు కమిషన్‌ నివేదిక
– శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి పితాని
అమరావతి, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : గోదావరి పుష్కరాల సమయంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం ముహూర్త కాలంపై జరిగిన దుష్పచ్రారమేనని సోమయాజుల కమిషన్‌ నివేదిక తేల్చింది. తొక్కిసలాట ఘటనపై నియమించిన కమిటీ ఆంధప్రదేశ్‌ ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించింది. ఆ నివేదికను మంత్రి పితాని సత్యనారాయణ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. 2015, జులై 14న గోదావరి పుష్కరాల తొలిరోజున తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద తొక్కిసలాట జరిగింది. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులు పుష్కరస్నానం కోసం ఒక్కసారిగా పోటెత్తడంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 27మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సీవై సోమయాజులు నేతృత్వంలో కమిటీ ఏర్పాటుచేసింది. కమిటీ ప్రత్యక్ష సాక్షులు, విధుల్లో ఉన్న అధికారులు, బాధితుల నుంచి వివరాలు సేకరించింది. పుష్కరాల తొలిరోజు ఉదయం 6.26 గంటలకు స్నానం చేస్తే మంచిదంటూ విస్తృతంగా జరిగిన ప్రచారమే ఈ ఘటనకు కారణమని కమిటీ తేల్చింది. ఈ ప్రచారంతోనే లక్షలాది మంది భక్తులు తెల్లవారుజామునే పుష్కరఘాట్‌కు చేరుకున్నారని.. బారికేడ్లను తోసుకుంటా ఒక్కసారిగా నదిలో దిగేందుకు ప్రయత్నించడంతోనే తొక్కిసలాట జరిగిందని నివేదికలో పేర్కొంది. ముహూర్త కాలంపై పత్రికలు, వార్తా ఛానెళ్లు, సోషల్‌ విూడియా, ప్రవచన కర్తలు చేసిన దుష్పచ్రారమే ఈ ఘటనకు కారణమని స్పష్టం చేసింది. ప్రజలను గుడ్డిగా నమ్మించడంతో విూడియా అధిక పాత్ర పోషించిందని.. అందువల్లే 27మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని కమిటీ తెలిపింది. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన అఫిడవిట్‌ను జతచేస్తూ 17పేజీల నివేదికను కమిటీ ఆంధప్రదేశ్‌ ప్రభుత్వానికి అందజేసింది.

తాజావార్తలు