చదువుతూ రాయాలి- నేర్పుతూ ఎదగాలి

మండల నోడల్ ఆఫీసర్ శోభారాణి

వీణవంక ఆగస్టు 2 (జనం సాక్షి ) వీణవంక ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధన కోసం 2022 ఆగస్టు 15 నుండి అమలు చేస్తున్న తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా పరిషత్ హై స్కూల్ వీణవంకలో రెండు రోజులపాటు కొనసాగే ఎఫ్ ఎల్ ఎన్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసి తెలుగు ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని మండల నోడల్ ఆఫీసర్ సుద్దాల శోభారాణి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు తాము విన్న, చూసిన, చదివిన కథ లేదా కవితను తమ మాతృభాషలో గాని, బడి భాషలో గాని మాట్లాడటం, ప్రశ్నించడం, కారణాలు చెప్పడం, తన స్వీయ అనుభవాలను తనదైన శైలిలో లిఖితపూర్వకంగా వ్యక్తపరిచేలా భావ ప్రసార నైపుణ్యాలను రూపొందించడం శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అన్నారు. ఇందుకోసం 140 రోజులు అనగా 28 వారాలను తప్పనిసరి బోధన దినాలుగా గుర్తించి ప్రణాళిక బద్ధంగా బోధనాభ్యాసన కార్యక్రమాలను అమలుపరచడానికి నమూనా పాఠ్య ప్రణాళికల ఆధారంగా ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను విద్యాశాఖ ఏర్పాటు చేసిందన్నారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి మాట్లాడుతూ… బొమ్మలను చూసి చదువుతున్న దానిని అర్థం చేసుకోవడం, గ్రంథాలయం నుండి తనకు నచ్చిన పుస్తకం విద్యార్థులు ఎంచుకొని చదివేలా ప్రోత్సహించడం, ఊహాశక్తితో, సృజనాత్మకతతో కథలు గేయాలు చెప్పేలా విద్యార్థులను సంసిద్ధులను చేయడం ఎఫ్ ఎల్ ఎన్ శిక్షణ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అన్నారు. కార్యక్రమంలో ఆర్పీలు బాలాజీ, శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, కరుణాకర్ రెడ్డి తోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తాజావార్తలు