చిత్తూరు టిడిపి నేత వ్యవహారంపై నిరసన

కానిస్టేబుల్‌పై దాడి ఘటనను కప్పిపుచ్చే యత్నం?

చిత్తూరు,జనవరి23(జ‌నంసాక్షి): చిత్తూరులో టిడిపి నేతల దాదాగిరి వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. బుధవారం చోటు చేసుకున్న ఘటనపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. జిల్లా టిడిపి ఆఫీస్‌లో ఆపరేటర్‌గా పని చేసే యుగంధర్‌ నాయుడు, అతని తండ్రి చంద్రశేఖర్‌ నాయుడులు ఏకంగా నడిరోడ్డు పైనే కానిస్టేబుల్‌ ను కర్రతో చితకబాదారు. ‘ పోలీసులైతే ఏం పీకుతార్రా ‘ అంటూ కర్ర తీసుకుని పదే పదే కొట్టారు. దీంతో కానిస్టేబుల్‌ తలకు గాయమైంది. ఈదృశ్యాలను కొందరు మొబైల్‌లో చిత్రీకరించడంతో వీడియో సంచలనంగా మారింది. జిల్లాలోని పెనుమూరు మండల కేంద్రంలో ఒక స్థల వివాదం కోర్టుకు చేరింది. ఆ స్థలంలో ఎవరూ పనులు చేయకూడదని, కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను ధిక్కరించి.. చంద్రశేఖర్‌ నాయుడు జేసీబీ సాయంతో ఆ స్థలంలో పనులు చేపట్టాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ ఆ పనులను అడ్డుకునేందుకు కానిస్టేబుల్‌ రమేష్‌ను పంపించాడు. అక్కడికి వెళ్లిన రమేష్‌ అనే కానిస్టేబుల్‌ కోర్టు ఆదేశాలను చూపించి ఇక్కడ పనులు చేయడం నేరమని చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో చంద్రశేఖర్‌ నాయుడు మహిళల సమక్షంలోనే కానిస్టేబుల్‌ను చితకబాదాడు. విషయం తెలుసుకున్న యుగంధర్‌.. వెంటనే ఎస్‌ఐకి ఫోన్‌ చేసి తన తండ్రి చంద్రశేఖర్‌ నాయుడి పై కేసు పెట్టవద్దని హుకుం జారీ చేశాడు. ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని స్టేషన్‌కు వెళ్లిన కానిస్టేబుల్‌ రమేష్‌ జరిగిన విషయాన్ని ఎస్‌ఐకు చెప్పి కేసు నమోదు చేయాల్సిందిగా కోరాడు. అయితే ఎస్‌ఐ కూడా టిడిపి వారికే వంత పాడాడు. ‘ కేసు పెట్టవద్దు.. లీవ్‌పై వెళ్లిపో ‘ అంటూ ఆదేశించాడు. దీంతో చేసేది లేక కానిస్టేబుల్‌ మనస్తాపంతో లీవ్‌పై ఇంటికి వెళ్లిపోయాడు. ఇంత బహిరంగంగా కానిస్టేబుల్‌ పైనే దాడి చేస్తే.. కనీసం కేసు కూడా నమోదు చేయలేని దుస్థితిని చూసి పోలీసులే ఆవేదన చెందుతున్నారు.