చిత్తూరు ప్రజల దశాబ్దాల కల నెరవేర్చాం

– నీరు బంగారంతో సమానం
– ప్రతిచుక్క సద్వినియోగం చేసుకోవాలి
– ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి, జనవరి22(జ‌నంసాక్షి) : చిత్తూరు ప్రజల మూడు దశాబ్దాల కల నెరవేర్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా జలాలు తరలివచ్చిన సందర్భంగా చిత్తూరు జిల్లా రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో చంద్రబాబు మాట్లాడారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు తీసుకెళ్లామన్నారు. అసాధ్యం అనుకున్న నీటి సరఫరాను సుసాధ్యం చేశామన్నారు. నూతన చరిత్రకు ఇవాళ శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. మదనపల్లి, పుంగనూరు, కుప్పం వంటి ప్రాంతాల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుందన్నారు. ఇన్నాళ్లూ సాగునీరు సమస్యగా ఉండేదన్నారు. 2014లో మదనపల్లి వచ్చి కాలవ వద్దే నిద్ర చేశానన్నారు. ఎంతో కష్టపడి చిత్తూరు జిల్లాకు హంద్రీనీవా ద్వారా నీటిని తీసుకొచ్చామన్నారు. వచ్చేఏడాది ఇంకా ముందుగానే
చిత్తూరు జిల్లాకు నీరు తీసుకొస్తామన్నారు. జిల్లాలో 10 ప్రధాన కాల్వలను వినియోగించుకుని నీటి సరఫరా చేస్తామని పేర్కొన్నారు. రిజర్వాయర్లు, చెరువులు నీటితో నింపుతామని, 40 చెరువులకు నీరివ్వాలని నిర్ణయించామన్నారు. భూగర్భ జలాలు అనూహ్యంగా పెరుగుతాయని, నీరు వస్తున్నాయని వరి వంటి పంటలు సాగు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. నీరు బంగారంతో సమానమని, ప్రతి చుక్క సద్వినియోగం చేసుకోవాలన్నారు.